ప్రకటన గ్రంథం నుండి ముఖ్య వచనములు
ఆదికాండము ప్రారంభ గ్రంథముగానున్నట్లు ప్రకటన గ్రంథము చివరి గ్రంథముగానున్నది. ఇందులో దేవుని యొక్క విమోచనా ఉద్దేశము సంపూర్తిస్థానము నధిష్టించుచున్నది. సువార్త పుస్తకములును, పత్రికలును అనేక ప్రవచనములతో యిమిడియున్నప్పటికిని ప్రవచన సందర్భములను కేంద్రము చేసికొని వ్రాయబడిన ఒకే క్రొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథమే. దాని శీర్షిక “తెరను వివరించి చూపుట” (బయలుపరచి చూపుట) అనునది దీని భావము. ఆ విధముగా ఈ గ్రంథము దేవుని గుణగణమును, సూచక క్రియలను, ఆధారము చేసికొని ఇది వ్రాయబడినది. ఇహలోక న్యాయమునకు న్యాయము తీర్చుటకును, దానిని నూతనపరచుటకును, నీతితో పరిపాలించుటకును ఆ క్రీస్తుకు మాత్రమే అధికారము గలదు.
Verses Related from the Bible:
Revelation 1
- 1. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
- 2. అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
- 3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
- 4. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
- 5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
- 6. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
- 7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
- 8. అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
- 9. మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.
- 10. ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
Revelation 1
- 11. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
- 12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
- 13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
- 14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
- 15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
- 16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
- 17. నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము;
- 18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
- 19. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
- 20. అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.
Revelation 6
- 1. ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
- 2. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
- 3. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
- 4. అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ¸
- 5. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
- 6. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
- 7. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
- 8. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవభాగముపైన అధికారము వానికియ్యబడెను.
Revelation 8
- 1. ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.
- 2. అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
- 3. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
- 4. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
- 5. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
- 6. అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
- 7. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
- 8. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.
Revelation 10
- 1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
- 2. ఆయన చేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,
- 3. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.
- 4. ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.
- 5. మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
- 6. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని
- 7. యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
- 8. అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.
- 9. నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
- 10. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
- 11. అప్పుడు వారునీవు ప్రజలను గూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
Revelation 13
- 1. మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.
- 2. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
- 3. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.
- 4. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటియెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.
- 5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను
- 6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.
- 7. మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.
- 8. భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.
- 9. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;
- 10. ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.
- 11. మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను;
- 12. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.
- 13. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.
- 14. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.
- 15. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
- 16. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును,
- 17. ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.
- 18. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.
Revelation 14
- 1. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.
- 2. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.
- 3. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.
- 4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.
- 5. వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.
- 6. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.
- 7. అతడుమీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
- 8. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చిమోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.
- 9. మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల
- 10. ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.
- 11. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.
- 12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
- 14. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను.
- 15. అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.
- 16. మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
- 13. అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
- 17. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.
- 18. మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.
- 19. కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను
- 20. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.
Revelation 19
- 6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
- 7. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
- 8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
Revelation 21
- 1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
- 2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట చూచితిని.
- 3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
- 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
- 5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు - ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు
- 6. మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
- 7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
- 8. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
- 9. అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,
- 10. ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
- 11. దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
- 12. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
- 13. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
- 14. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
- 15. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
- 16. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
- 17. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
- 18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
- 19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
- 20. అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
- 21. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
- 22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
- 23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
- 24. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
- 25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
- 26. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
- 27. గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
Revelation 22
- 18. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
- 19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.