ఈ రోజు, ఇలా ప్రారంభించు...
యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. నెహెమ్యా 8:10
శమల ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ఆనందాన్ని చురుకుగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఒత్తిడి లేదా భారం పెరుగుతున్నప్పుడు మనం మాట్లాడే ప్రతీ మాట విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి.
అనవసరమైన విషయాలు లేదా సరికాని విషయాల మీద ఎక్కువగా ద్రుష్టి సారిస్తే నిరుత్సాహము చెంది బలహీనులము కాగలము. ఉదయమున లేచామంటే నిరుత్సాహంతో ఆలోచించకుండా, ఈ రోజు ఎం జరగబోతుందనే ధోరణిలో మనం ఉండకుండా... ప్రార్ధనతో ప్రారంభిస్తే ఏ పరిస్థితినైనా చేధించగలం.
గెలుపుకు ఓటమికి మధ్య దూరం ఓర్పుతో మనం చేసే ప్రయత్నాలే కదా. విజయం కేవలం ఒకే దారిని చూపిస్తుంది, కాని అపజయం ఎన్నో పరిష్కార మార్గాలను అందిస్తుంది. ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించి చూడు, విజయం నీ బానిస అవుతుంది. ప్రేమ, సంతోషం, మంచితనం, స్నేహం, నమ్మకం ఏదైతే ఇతరులదగ్గర నుండి మనం ఆశిస్తున్నామో అదే మొదట మన నుండే ప్రారంభం అయితే దాని వలన మనం పొందే ఆనందం మరోలా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తో పాటు దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే చేసే పనిలో, ప్రతి విషయంలో ఆనందాన్ని పొందగలం.
ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొనే బలమును దయచేయుమని అనుదినం ప్రార్థించాలి. నిత్యుడైన దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించినప్పుడు శ్రమలకింకా తావేలేదు కదా. కాబట్టి, క్రీస్తులో సంతోషాన్ని పొందుతూ, మన ఆనందాన్ని ఆయన ప్రేమలో వెదుకుతూ, బలము పొందుటకు ప్రయత్నిద్దాం. ఆశీర్వాదాలకు కారకులమవుదాం. ఆమెన్.
Audio: https://www.youtube.com/watch?v=mp6K2ccpudw