సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
Audio: https://youtu.be/rmV6hWSEw2Q
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్యాంకులు సాధిస్తేనే కదా చేరుకోవాలన్న లక్ష్యాన్ని సుళువుగా చేరుకోగలరు. అయితే ఇది లౌకిక జీవితంలో తప్పకుండా ఉండవలసిందే. విశ్వాస జీవితంలో… ప్రత్యేకంగా సంఘ జీవితంలో సహ విశ్వాసులతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు ఈ అనుభవం భిన్నంగా ఉంటుంది.
ఈ అనుభవాన్ని అపో. పౌలు రోమా సంఘంలోని క్రైస్తవ విశ్వాసులకు ఇలా వ్రాసాడు. రోమా 12:5-6. “ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము”. పౌలు పేర్కొన్న వరములలో ప్రవచనము, పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పైవిచారణ చేయుట, కరుణించుట మొదలగునవి ఉన్నవి. ప్రతి వరము అందరి శ్రేయస్సు నిమిత్తముగా వాడబడాలి.
ఒక సంగీత సభలో గాయక బృందము మరియు వివిధ సంగీత వాయిద్యములు వాయించు వారు సమిష్టిగా చేసే కార్యము మనకు శ్రావ్యంగా వినిపిస్తుంది కదా. మనలోని తలాంతులను, వరాలను కలిసి సంఘంలో ఉపయోగించినప్పుడు ఆ సంఘం పరిచర్యలోను, సువార్తలోను అభివృద్ధి చెందుతుంది. వేవ్వేరు వరములు కలిగిన మనం సంఘముగా కలిసి ఆయన పరిచర్య జరిగించాలనేదే ప్రభువు ప్రణాళికై యున్నదని గమనించాలి. 10వ ప్రకారం “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై యుండుడి”. అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దీని అర్ధం సహకారమే, పోటీతత్వం కాదు. మనకున్న తలాంతులను వరాలను సంఘముగా, సమిష్టిగా వాడాలనే ఆలోచన మనలో ఉన్నప్పుడే ఐక్యతకు మాదిరిగా ఉండి, ఆశీర్వాదాలకు కారకులమవుతాము.