శత్రువుపై విజయానికి 3 మెట్లు


  • Author: Rev Anil Andrewz
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

శత్రువుపై విజయానికి 3 మెట్లు
Audio: https://youtu.be/PMJUIlVTiEY

విశ్వాస జీవితములో అతి బాధకరమైన పరిస్థితి ఒకటుంది, అదే అబద్ధ సాక్ష్యం. చేయనివాటిని చేసామని, జరుగనువాటిని జరిగాయని ప్రచారం జరుగుతున్నప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాము. అర్థం చేసుకొనేవారు లేక, అర్థమయ్యేలా చెప్పలేక కృంగిపోయే పరిస్థితిలో ఉంటాము.

ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే; నిజమేమిటో అబద్ధము చెప్పేవాడికి తెలుసు, కాని నిజం చెప్పడు. అబద్ధమేమిటో అనుభవించేవాడికి తెలుసు కాని అర్థమయ్యేలా అది అబద్ధమని చెప్పలేడు. ఇవన్ని విశ్వాస జీవితములో సర్వసాధారణమైన పరిస్థితులు. యేసు ప్రభువు మరణమును జయించి సమాధిని బద్దలు కొట్టి లేచుట సైనికులు ప్రత్యక్షముగా చూసిన, పరిసయ్యులు ఇచ్చిన ద్రవ్యం వారి నోరు మూపించింది.

ప్రస్తుత దినములు అబద్ధానికే జై కొడుతున్నాయి. అబద్ధం చెప్పడానికి ఆనందముగాను వినడానికి తీపిగాను ఉంటుందుల కాని, అబద్ధికులకు పరలోకములో స్థానమేలేదు. అందుకనే చెప్పేవారుంటే వినేవారికి కొదువలేదు, వినేవారుంటే చెప్పేవారు పుట్టుకొస్తారు అందుకని చెప్పేవారికి చెవిని వినేవారికి అవకాశం ఇవ్వకుండా జీవించడమే క్రైస్తవ జీవితం. పేతురు కూడ తన పత్రికలో మనం మేలు చేసి బాధపడి సహించుటకే పిలువబడినామని తెలియజేసాడు (1 పేతురు 2:20).

అబద్ధ సాక్ష్యములు ఎదురైనప్పుడు ఏమి చేయ్యాలో కీర్తనలలో ఈ విధముగా ఉన్నది. కీర్తన 27:12 అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము.13 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.

ఈ భాగములో మూడు విషయాలు చెప్పుతున్నాడు. 1. ప్రార్థన చేయ్యాలి 2. దేవుని పైన విశ్వాసముంచాలి 3. దేవుని కార్యం కొరకు నిరీక్షిచాలి. ఈ మూడిటి వలన నీ శత్రువు అబద్ధ సాక్ష్యంతో నీకు వ్యతిరేకముగ వచ్చిన, నీపై క్రూరత్వము వెళ్లగ్రక్కిన నిన్ను ఏమి చేయలేడు, నీపై విజయము సాధించలేడు.

సమస్యలలో ప్రార్ధన, విశ్వాసం, నిరీక్షణ కలిగియుంటే నీ శత్రువు కోరికకు దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుని దయను పొందుకొని స్థిరముగాను, నిబ్బరముగాను ఉంటావు.