“...యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము...” హబక్కుకు 3:2.
ప్రవక్త అయిన హబక్కుకు దేవునికి చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్ధన ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్ధన.
డిసంబరు 31వ తా||న మధ్యరాత్రివేళ పాత సంవత్సరపు చివరి ఘడియలలోను, నూతన సంవత్సరపు ఆరంభ ఘడియలలోను, ప్రతి విశ్వాసి తాను ఆశించిన నూతనత్వము కొరకు ఎదురు చూస్తున్న సమయములో “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.”(కీర్త 37:4,5 ) అను శక్తివంతమైన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొంటూ విరిగి నలిగిన హృదయంతో,కృతజ్ఞతా భావంతో,సమర్పణగల స్వభావంతో ప్రభువు పాదాల చెంత మోకరిల్లి, దేవుని చిత్తానుసారమైన హబక్కుకు చేసిన ప్రార్ధనను మనమును తప్పక చేయవలసిన వారమైయున్నాము.
ఎందుకని? సమస్యల వలయంలో చిక్కుకుని బ్రతుకు భారంగా వెళ్ళదీస్తూ రేపటి మీద గంపెడంత ఆశపెట్టుకొని, వాగ్దానాల నేరవేర్పు కొరకు కళ్ళలో ఒత్తువేసుకొని జయజీవితం కొరకు ఎదురు చూచే సగటు విశ్వాసి కూడా ఈ ప్రార్ధన చేయవలసిందేనా? తన సమస్యలన్నిటిని ప్రక్కకు పెట్టి ఈ ప్రార్ధన చేయడానికి దానితో ఉన్న విశిష్టత ఏమిటో...!
ఈ ప్రార్ధన నాలుగు భాగాలుగా జేసుకొని ధ్యానించి నట్లయిన, ఆత్మ దేవుడు దానిలోని పరమార్ధాన్ని మనకు సవివరంగా భోదిస్తాడు. మొదటి భాగం – యెహోవా :
యేహోవాయే దేవుడు వేరొక దేవుడు మనకు లేడు. అయన ఉన్నవాడును అనువాడునైయున్న దేవుడు. ఆయన ఆత్మయై,జీవమై, దోషరహితుడై, అద్వితీయుడై, నిత్యుడై, రాక్షకుడైయున్న దేవుడు. అయన మాత్రమే దేవుడై సర్వ శక్తిమంతుడై, సృష్టికర్తయై, నీతిమంతుడై, వివేచనగాలవాడై, మంచివాడై, సర్వాధిపతియై, పరిశుద్ధుడై, నమ్మకమైనవాడై, మార్పులేనట్టివాడై, సర్వవ్యాప్తియైయున్నవాడై, సర్వజ్ఞానియై, సర్వభౌమత్వముగలవాడై, ప్రేమగలవాడై, వెలుగై, సత్యవంతుడై, మంచివాడై, న్యాయవంతుడై, కృప కనికరములుగలవాడై, ఒర్పుగలిగి క్షమించు స్వభావముగలవాడై యుండి మనలను పరిపాలిస్తూ, జీవింపజేస్తూ ఉన్న త్రియేక దేవుడు. వర్ణనాతీతమైన అద్భుత లక్షణాలుగల ఈ దేవునికి మాత్రమే మనం ప్రార్ధన చేయాలి. మన ప్రార్ధనలను విని మనకు కావలసిన సర్వ ఈవులను దయ చేయువాడు ఈయనే. అందుకే హబక్కుకు ప్రేమగల ఈ దేవునికి మొర్రపెట్టుకుంటున్నాడు. మనం కూడా అలాగే చెయ్యాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు అయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అయన మీద వేయుడి. ( 1పేతురు 5:6,7). అయన మన సకల సమస్యలను పరిష్కరించి ఆదరించే దేవుడు. దావీదు భక్తుడు తన సాక్ష్యం చెబుతూ అంటాడు “యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు” (కీర్త 34:9 ). ఎందుకనగా ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను ( కీర్త 34:6 ). ‘యేహోవాయే మన కాపరి’ అను సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్ధించాలి. “నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును” (ద్వి.కాం. 11:12). ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు ( కీర్త 121:4,5).
1. రెండవ భాగము – సంవత్సరములు జరుగుచుండగా:కాలం ప్రవాహం లాంటిది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. జరిగిపోవుటే దాని లక్ష్యం. దీన్ని ఆపగలశక్తి దేవునికి మాత్రమే ఉంది. ఇది అశాశ్వతమైనది. విశేషం ఏమిటంటే కాలం ఎప్పుడు క్రొత్తది కాదు – పాతదికాదు. సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదని (ప్రసంగి 1:9) మనిషి మారితే కాలం మారుతుందని, “ కాగా ఎవడైన క్రీస్తునందున్న యెడల అతడు నూతన సృష్టి యని పాతవిగతించెను ఇదిగో క్రొత్తవాయెను (IIకొరి 5:17) అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తు తాకిన కాలం నూతనమయ్యింది. క్రిస్తుతోనే నూతన యాగం ఆరంభమైంది.
జక్కయ్య జీవితం ప్రభువును కలుసుకొనే వరకు పాపసంకిలమైన పాత జీవితం గాని ఏనాడైతే అతడు ప్రభువు కొరకు ఎదురు చూచి ఆయనను కలుసుకుని,తన పాపములు ఒప్పుకుని, మారుమనస్సు నొంది యేసును వెంబడించాడో ఆనాటినుండి అతని జీవితం నూతజీవితం అయ్యింది (లూకా 19:9) ఆనాటి నుండి కాలమే నూతనత్వాన్ని సంతరించు కుంది. మనం సకల జ్ఞానాన్ని, ధనాన్ని,శక్తిని సంపాదించుకున్న దినం కంటే రక్షణ దినమే గొప్ప దినం. అదే నూతనవత్సరం. ఆనాడు దేవునితో కోల్పోయిన సంబంధం తిరిగి ముడి వేయబడి పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించి పెడుతుంది. అంతే గాని నూతన తలంపులు సిద్దాంతాలు మనలను నూతన పరచలేవు కేవలం నూతన జన్మ మాత్రమే మనకు నూతన సంవత్సరాన్ని ప్రసాదిస్తుంది.
మూడవ భాగం : నీ కార్యము : పాపియైన మానవ రక్షణే అయన కార్యం . అనగా సాతాను రాజ్యాన్ని పునాదులతో సహా కూలద్రోసి దైవ రాజ్యాన్ని నెలకొల్పడం . ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల చేత సాతానుడుపాపం చేయించి తన చీకటి రాజ్యానికిపునాదులు వేసాడు. నేడు మహా సామ్రాజ్యంగా ఎదిగి విశ్వమంతా వ్యాపించింది. ఆ చీకటి రాజ్యాన్ని కూలద్రోయడానికే దేవుడు నరావతారియై ఈ లోకం లో అవతరించి పాపులు అనుభవించవలసిన శిక్షను సిలువలో తానే అనుభవించి సాతాను రాజ్య విచ్చిన్నతకు పునాది వేసాడు సాతాను రజ్యం సమూలంగా నాశనం కావాలంటే సిలువను ఆయుధంగా ధరించాలి. సిలువను ధరించగల సాహసం కేవలం ఉజ్జీవింపబడిన విశ్వాసికి మాత్రమే సాధ్యం. గనుక ఏదినాన విశ్వాసి ఉజ్జివింప బడుతాడో ఆ రోజే నూతనవత్సరం ఆరంభం . నాల్గవదిగా : నూతనపరచుట: నూతనపరచుట అనగా ఉజ్జీవింపజేయుట అని అర్ధం . పాటి విశ్వాసి ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవం లేని విశ్వాసి దేవుని రాజ్య స్థాపనలో తన కర్తవ్యాన్ని నెరవేర్చలేడు. దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించలేడు . అయితే ఉజ్జీవింప బడుటం ఎలా?
(అ) ఒక వ్యక్తి క్రీస్తుయేసే నా రక్షకుడని విశ్వసించినప్పుడు రక్షింపబడుచున్నాడు .రక్షింపబడిన విశ్వాసి ఉజ్జీవింపబడాలంటే తన సిలువను తాను ఎత్తుకొని క్రీస్తును వెంబడించలి.
(ఆ) క్రీస్తు చేత రక్షింపబడిన విశ్వాసి తాను చేసిన పాపం నుండి విడుదల నొందుచున్నాడు. అలా విడుదల నొందిన విశ్వాసి ఉజ్జీవింపబడాలంటే క్రీస్తు నీతిని సంపాదించుకోవాలి .
(ఇ) రక్షింపబడిన విశ్వాసి సాతాను కాడి నుండి తప్పింపబడుచున్నాడు. అలా తప్పింప బడిన విశ్వాసి ఉజ్జీవింపబడాలింటే క్రీస్తు కాడిని ఎత్తుకోవాలి.
(ఈ) రక్షింపబడిన విశ్వాసి దేవునిని, దేవుని కృపను కూడా సంపాదించుకొనుచున్నాడు. అతడు ఉజ్జీవింపబడాలంటే తాను సంపాదించి దేవునిని అయన కృపను ఇతరులకు బహుకరించాలి.
(ఉ) సువార్తను అంగీకరించుట ద్వారా రక్షింపబడిన విశ్వాసి అదే సువార్తను ఇతరులకు ప్రకటించుట ద్వారా ఉజ్జీవింపబడుచున్నాడు.
ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాలు ఉజ్జీవింపబడాలని దేవుని పూర్ణహృదయంతో ప్రార్ధన చేద్దాం. దేవుని రాజ్యాన్ని మొదట మనం వెదకితే మనకు కావలసినవన్ని ఆయనే అనుగ్రహిస్తాడు.
దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక.