మూల పాఠములు


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మూల పాఠములు - మొదటి భాగం

కొలస్సి 2:6-8 అధ్యయనం

“కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచార మును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి”.

క్రైస్తవ విశ్వాస విషయంలో మూల పాఠములను తెలుసుకోవడమనే అంశం అత్యంత ప్రాముఖ్యమైనది, అంతేకాదు, ఏ సువార్తనైతే నమ్మి విశ్వసిస్తూ ఉన్నామో అట్టి నమ్మకానికి ఈ వాక్యం పునాది వంటిది. అప్పుడే అంకురిస్తున్న సంఘానికి అపో.పౌలు ఈ పత్రికను వ్రాస్తూ, సువార్తను అంగీకరించిన విషయంలో వారి జీవితాల్లో ఎటువంటి కార్యం జరిగిందో అదే విషయాన్ని బహుశా అవగాహన చేసుకోవాలని ఆనాడు కొలస్సీ సంఘానికి వివరిస్తూ నేడు మనకును జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. క్రీస్తులో నూతన జీవితాన్ని ఆస్వాదిస్తూ, సంపూర్ణంగా స్థిరపరచబడడమేకాక, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుడు మన యెడల కలిగియున్న ప్రణాళికలను మరియు సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవాలని పౌలు గారు ఆశించారు.

వ్యక్తిగత అనుభావాలనుండి నేర్చుకునే ఈ ప్రక్రియ మన విశ్వాస జీవితంలో వినూత్నమైనది. “నడచుట” అంటే ఒక వ్యక్తి తన జీవితమంతా ఎలా జీవించాలి మరియు తన ప్రవర్తనను ఎలా కాపాడుకోవాలి అని అర్ధం. అంటే, వేరులు పారి, కట్టబడుతూ విశ్వాసంలో స్థిరపరచబడాలని పౌలు గారి ఉద్దేశం. విశ్వాసమనేది కేవలం మన రక్షణకు పరిమితం కాదు గాని మన జీవితంలో ప్రతి విషయానికి దానిని అది ప్రవర్తింపజేయాలి.

ఈ విషయాలను వ్యక్తం చేయడానికి పౌలు తత్వాన్ని ఉపయోగించాడు. లోకానికి తత్వం ఉంది, యేసు క్రీస్తుకూ తత్వం ఉంది. అయితే, ఈ లోక తత్వజ్ఞానం ఒక తరం నుండి, ఇంకొక తరానికి అప్పగించబడిన మానవ ఆచారముల మీద నిర్మించబడింది. “ఆచారము” అంటే విధులు, అనగా బోధించుటకు పూర్వికులచే ఇవ్వబడిన విషయం. లోకసంబంధమైన మనుష్యుల పారంపర్యాచారాలను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మనల్ని అది చెరపట్టుకొని మన విశ్వాస జీవితాన్ని అది పాడుచేస్తుందేమోనని జాగ్రత్తగా ఉండమని అపో.పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు.

మూల పాఠములు - రెండవ భాగం

నిన్నటి భాగంలో మనుష్యుల పారంపర్యాచారమును మరియు ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించడం మన విశ్వాసానికి తగదని నేర్చుకున్నాము. ఈరోజు యేసు క్రీస్తునందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మనం నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడే విషయాలను అధ్యాయనం చేద్దాం.

సహజంగా క్రైస్తవ బోధ అంటే మన నమ్మకము. క్రీస్తు బోధలను గూర్చి బోధిస్తూ ఉన్నప్పుడు అనేకసార్లు క్రైస్తవ జీవన విధానాన్ని ఎలా నడచుకొవాలో మరచిపోతూ ఉంటాము. ఏ బోధననైతే యేసు క్రీస్తు తన శిష్యులకు నేర్పించాడో అదే బోధన క్రమాన్ని ఆది సంఘంలోని అపోస్తలులు, సంఘనాయకులు ఇటువంటి బోధనా విధానాలను ఉపయోగించేవారు. ఈ బోధనల సారాంశం ఏమిటంటే, మన జీవితాలు ఆయన సారూప్యమునకు మనలను మార్చుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని అర్ధం.

మూల పాఠములను గూర్చిన ఏడు ప్రాముఖ్యమైన విషయాలు:
1. దేవుని పోలికగా సృష్ఠింపడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎఫెసీ 4:22-24
2. ఆత్మఫలములు ఫలించాలి. గలతి 5:22,23
3. మన కుటుంబాల్లో ఉండవలసిన క్రైస్తవ సత్సంబంధము. ఎఫెసీ 5:22
4. క్రైస్తవ సమాజంలో ఉండవలసిన సరైన సంబంధాలు. రోమా 12:9,10
5. క్రైస్తవేతరులతో మన వ్యవహార పద్దతులు. కొలస్సి 4:5,6
6. ప్రభుత్వం పట్ల, సంబంధిత అధికారులతో ఉండవలసిన సరియైన సంబంధాలు. 1 పేతురు 2:13,14
7. వ్యక్తిగత విశ్వాసము పడిపోకుండా, బాధ్యత కలిగి జాగారూకులమై యుండాలి. 1 పేతురు 5:8

మనము మన జీవితంలో ఇట్టి మూల పాఠములను అనుసరిస్తున్నామా లేదా అనేది మన ఫలాలను బట్టే తెలుసుకొనగలం. కాబట్టి ఈ పాఠములను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని పాటిస్తే విశ్వాస జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ప్రయత్నించి చూడండి. ఆమెన్

https://youtu.be/1uE7dzM3jR0