గొప్ప విడుదల


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Daily Devotion

ఇప్పుడు నా కుమారుని వయస్సు పది నెలలు. ఇప్పుడిప్పుడే నిలబడడం నేర్చుకుంటున్నాడు. వాడు నిలబడిన ప్రతిసారి క్రిందపడిపోతాడు, కొన్నిసార్లు దెబ్బలు తగిలి ఏడుస్తాడు. వాడు ఏడ్వడం నాకష్టములేక వాడు పడుతున్నప్పుడు నేను చూసిన ప్రతిసారి నా కాలు లేదా చెయి అడ్డు పెట్టి దెబ్బ తగలకూడదని ప్రయత్నిస్తుంటాను. నా కుమారునికి దెబ్బతగలకూడదని, వాడు ఏడ్వకూడదని నేను చేస్తున్న ప్రయత్నం గమనించినప్పుడు నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది -

Psa 116:8 మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

దేవుని నమ్మిన వారి జీవితములో జరిగే కార్యం ఇదే. ఈ వాక్యములో దేవుడు మన జీవితములో చేసే మూడు కార్యములు కనిపిస్తున్నాయి. ఒకటి మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళు రాకుండ కన్నులను, జారిపోకుండ పాదములను దేవుడు కాపాడుతున్నాడు.

శ్రమలు మన ప్రాణమును మరణము వరకు తీసుకెల్తాయి, శ్రమలలో ఉన్నవారికి మరణములో ఉన్నంత బాధ కలుగుతుంది, మరణముతోనే సహవాసం చేస్తున్నట్లుగా ఉంటుంది. శ్రమలు ప్రాణమును నలుగగొడతాయి, శ్రమ బ్రతకాలనే ఆశను చంపేస్తుంది. కీర్తనలు 105:18 వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అని యోసేపు గురుంచి వ్రాయబడినది. శ్రమలు ఇనుప సంకెళ్ళ వలె ఉండి ప్రాణమును బాధిస్తాయి. శ్రమలను మనిషి ఎదుర్కొనలేడు అందుకే దేవుడే శ్రమల నుండి అనగా మరణము నుండి ప్రాణమును తప్పించగలడు.

బాధలే కన్నీళ్లు పెట్టిస్తాయి. తీరని బాధలతో నీవు నలిగిపోతున్నావా? బాధ హృదయానికి గాయం చేస్తుంది. కొంత మంది మాటలతో, కొంతమంది వారి ప్రవర్తనతో గాయం చేస్తారు. నమ్మిన వారు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, నమ్మిన వారు నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు ఎటువంటి బాధ ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. అందుకే అటువంటి బాధ నుండి తప్పించడం ఆ దేవునికే సాధ్యం.

పాదములు జారుటకు కారణం తొందరపాటు. అనవసరముగ ఈ పని చేసాను, తొందరపడి మాటిచ్చానని బాధపడని వారుండరు. అనాలోచితముగ కొన్ని పనులు చేసి తొందరపడ్డానని బాధపడుతున్నావా? తొందరపాటువలన జీవితములో కోల్కోలేని దెబ్బలు తగిలిన సందర్భాలు లేకపోలేదు. తొందరపాటు కలిగిన పేతురు జారిపడిపోకుండ కాపాడింది యేసు ప్రార్ధన. ఆ ప్రార్ధనలోని ప్రభావం నేటికి తగ్గలేదు. ఆ ప్రభావం నీ పాదములు జారకుండ కాపాడగలదని నమ్మగలవా?

ఈ రోజు మరణమగునంతగా నీ ప్రాణం నలిగిపోతున్నా, నీ బాధలు కన్నీళ్ళు పెట్టిస్తున్నా, నీ పాదములు జారే పరిస్థితిలో ఉన్నా, నీవు ఎటువంటి బాధలో ఉన్నా, దేవుడు నిన్ను విడిపించగలడని విశ్వాసం నీకుంటే; నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడని ఇప్పుడే విశ్వాసముతో నీ ప్రాణముతో చెప్పు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసు ప్రభువు నీ జీవితములో క్షేమము విస్తరింరజేయును గొప్ప విడుదల కలుగజేయును గాక!
https://youtu.be/U8xo9xat7Rw