పరిశోధనా సమయాలు


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

పరిశోధనా సమయాలు

ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, ఆ పనిని ఎంతో సామర్థ్యంతో నిర్వర్తించినప్పటికీ వైఫల్యం చవిచూస్తుంటాము. కొన్ని సార్లు నిరాశాజనకంగా ఉండే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓడిపోయామని గ్రహించినా తిరికి పూర్వవైభవంతో ప్రారంభించి మన శక్తినంతా వెచ్చించి చేసినా విజయాన్ని కొద్ది దూరంలో వదులుకోవాల్సి వస్తుంది. జీవితం మనకు పెట్టే ప్రతి పరీక్షలలో ఫెయిల్ అయ్యం అనిపించే ప్రతి సమయం అది మనం పాసవ్వడానికి పెట్టిన పరీక్ష కాదు. ఎందుకంటే ప్రతి పరీక్ష మనలోని అతి బలహీనమైన ఓర్పును బలంగా మారుస్తూ, మనలను మరింత మెరుగుపరచడానికేనని గ్రహించిన మన ఆలోచనల్లో గొప్ప అనుభవం దాగి ఉంది.

బహుశా ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ఒక కష్టాన్ని గురించి బాధపడుతున్నావేమో. మన సహనాన్ని, మన ఆధ్యాత్మిక ధారుడ్యాన్ని ధృఢపరచుకోవడం కొరకు ఈ పరిశోధనా సమయాలలో నుండి వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. మనము ఆయాన సారూప్యములోనికి, అనగా క్రీస్తులా మరింత ఎక్కువగా ఉండడానికి, ఆయనపై ఆధారపడడము నేర్పించి, పరిశుద్ధముగా ఉండడానికి మనలను అనుదినం పవిత్రపరుస్తూ ఉంటాడు.

బానిసత్వంలో, పరదేశం లో శ్రమలు పొందినప్పుడు అగ్నిద్వారాను, నీళ్ళ ద్వారాను దేవుడు ఇశ్రాయేలీయులను శుద్ధి చేసిన అనుభవాన్ని కీర్తనాకారుడైన దావీదు (కీర్తన 66:10) లో “నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు” అని అంటూ దేవుని స్తుతించడంలో ఆశ్చర్యం లేదు. దేవుడు వారిని భద్రపరచి సమృద్ధిగల ప్రదేశంలోనికి వారిని నడిపించడముతోపాటు, ఈ ప్రక్రియలో పరీక్షల ద్వారా వెండిని శుద్ధిపరచినట్టు, దేవుడు వారిని శుద్ధులుగా కూడా చేశాడు.

మనము పరీక్షలద్వారా వెళ్ళినప్పుడు, శక్తి కొరకు, పట్టువిడువకయుండునట్లు దేవునిపై ఆధారపడవచ్చు. మన అతి క్లిష్ట పరిస్థితులు, అవి దేవుడు అనుమతించిన పరిశోధనా సమయాలని గ్రహించినప్పుడు, ఆయన మనలను శుద్ధి చేస్తూ మనలను నిర్మలులనుగా చేయగలడు. ఆమెన్.

https://youtu.be/q47wuYZuSDg