కృపను ప్రదర్శించడం
గెలుపుకు ఓటమికి మధ్య దూరం మన తలవెంట్రుకంత. ఈ చిన్న తేడాతో కొన్ని సార్లు మనం గెలుస్తాము అదే తేడాతో మన జీవితంలో అనేకసార్లు ఓడిపోతుంటాము. మన చుట్టూ ఉండే స్నేహితుల మధ్య గాని, లేదా పనిచేస్తున్న ఆఫీసులో, లేదా నలుగురితో మనం గడిపే సంభాషణలో గాని మనకు దక్కని ప్రాధాన్యత మరొకరు పొందుకునే సందర్భంలోన ఎదుర్కొనే అపజయం, నిరుత్సాహానికి గురైన మన గెలుపు, మన అంతరంగంలో ఉద్భవించే ప్రకంపనలు. ఎదుటివారి గెలుపును జీర్ణించుకోలేని ఆ కోపం మరియు చిరాకుల్లో మనం మాట్లాడే ప్రతి మాట అవి ఎదుటివారి హృదయాన్ని గాయపరిచేలా ఉంటాయి.
నేనంటాను, మనం గెలవాలనుకోవడం తప్పేమీ కాదు, అది మనలోని స్ఫూర్తి. అయితే ఇక్కడ పొరపాటు ఏమిటంటే “నేను మాత్రమే గెలవాలి”, “నేను మాత్రమే అర్హుడను” అని అనుకోవడంవల్లే మనం ఓడిపోయాం. ఓటమిని ఓర్వలేని మన అహం, ఇతరులకు ప్రత్యుత్తరమిచ్చే మన మాటల్లో, విజయం ఎన్నడు మనకు చేరువగా ఉండలేకపోతుంది. మనతో ఎల్లప్పుడూ ఉండేవారితో, లేదా ప్రతిరోజు మనతో సమయాన్ని గడిపేవారితో మనం చూపించే ప్రవర్తనలో పరివర్తన వచ్చినరోజే మనం గెలిచినట్టు. ఇది నా కుటుంబం, నా సంఘం, నా సమాజం అందరు నా వాళ్ళే అని అనుకునే మన ఆలోచనలే మన విజయరహస్యాలు. ఇతరుల గెలుపులో కూడా సంతోషించే మన జ్ఞానమే ఆ పరమాత్ముని నుండి మనం పొందుకున్న కృపకు సాదృశ్యంగా ఉంది.
“… సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. (కొలస్స 4:5,6)” అని అపో. పౌలు యేసు క్రీస్తును వెంబడించే కొలస్సయులను ఆనాడు అర్ధించాడు, నేడు మనకును జ్ఞాపకము చేస్తున్నాడు.
కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని కృపను ఉచితముగా పొందిన వారమైన మనము, గెలిచినా ఓడినా జీవితములో ప్రతి పరిస్థితిలో దానిని ప్రదర్శించడం మన భాగ్యము, మన పిలుపు. ఆత్మీయమైన ఇట్టి జీవితాన్ని ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.
Video Link: https://youtu.be/ZSW290a8xeg