అయ్యో, అలా జరుగకుండా ఉంటే?


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

అయ్యో, అలా జరుగకుండా ఉంటే?

ఒకరోజు ఓ వ్యక్తి తన స్కూటర్ పై ప్రయాణం చేస్తూ, అత్యంత భయంకరమైన వర్షం కురుస్తున్న కారణంగా ఎటు వెళ్ళలేక, అతి పెద్దదైన ఒక చెట్టు క్రింద ఆగి, వర్షం తగ్గగానే తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. భయంకరమైన వర్ష సమయాల్లో పెద్ద పెద్ద చెట్ల క్రింద నిలిచియుండడం ప్రమాదకరం, పిడుగులు పడే ప్రమాదం ఎంతైనా ఉంటుంది. అలా అనుకున్నట్టే జరిగింది. అనుకోకుకండా ఓ పెద్ద పిడుగు పడడంతో ఆ చెట్టు కొమ్మలు విరిగి అతనిమీద పడేసరికి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన నా జీవితంలో నేను వీక్షించిన ఒక అనుభవం.

తరువాత ఆ దుర్ఘటన గురించి ఆలోచించినప్పుడల్లా ఒకవేళ అతడు అక్కడ ఉండి ఉండకుండా ఉండవలసింది, అయ్యో అలా జరుగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటూ... రెండవమారు మనలను మనము ప్రశ్నించుకునేలా కష్టాలు ఒక చక్రములా మనలను చుట్టుకుంటాయి. త్రాగుబోతులతో నా కుమారుడు స్నేహం చేస్తున్నాడని ముందే తెలిసుంటే... క్యాన్సర్ ఉందని ఇంకా కొంచెము ముందే తెలిసికొనియుండుంటే... ఇటువంటి ఊహించని కష్టము వచ్చినప్పుడు, మనము దేవుని మంచితనాన్ని ప్రశ్నిస్తాము. వారి తమ్ముడు చనిపోయినప్పుడు మరియమార్తల్లాగా నిస్పృహ చెందవచ్చు. “ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను” (యోహాను 11:32) లాజరు అనారోగ్యంగా ఉన్నాడన్నవార్త తెలియగానే యేసు అక్కడికి వచ్చియుండి ఉంటే? అయ్యో అలా జరుగకుండా ఉండి ఉండేది కాదు కదా!.

కష్ట పరిస్థితులు మనకెందుకు సంభవిస్తాయో మరియమార్తల్లాగా మనకు ప్రతీ సారి అర్ధం కాదు. అయితే మరింత ఉన్నతమైన ఉద్దేశము కొరకు ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడన్న గ్రహింపుతో మనము నెమ్మది పొందవచ్చు. ప్రతి పరిస్థితిలో నమ్మదగిన, ప్రేమ కలిగిన దేవుని జ్ఞానమందు విశ్వసించవచ్చు. వెలుగులో దేవుణ్ణి విశ్వసించడం కంటే, చీకటిలో దేవుని నమ్మడంలో గొప్ప అనుభవం ఉంది – విశ్వాసం అంటే అదే! ఆమెన్.

https://youtu.be/Vi5PHEFbimE