విశ్వాసముంటే భయమెందుకు?
ఒక పనిని తలపెట్టాలి ముందుకు వెళ్ళగలుగుతానా లేదా? నా వివాహం ఎలా ఉంటుందో ఏమో? ఉన్నత చదువులు చదవగలనా? మంచి ఉద్యోగం వస్తుందా? బిడ్డలు పుట్టలేని పరిస్థితి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నష్టం లేని వ్యాపారం చేయగలనా? శక్తికి మించిన ఉద్యోగం నిలబెట్టుకోగలనా? భారంతో నడిపిస్తున్న నా కుటుంబంలో ఆర్ధిక సమస్య ఎప్పుడు తీరుతుంది? నా ఆరోగ్య సమస్య నుండి బయటపడగలనా? అయ్యో ఇటువంటి ప్రశ్నలు మనల్ని ప్రతి రోజు భయపెడుతూనే ఉంటాయి. ఈ భయం మన నుండి పారిపోవాలంటే? మనం పొందుకోవలసింది ఒక్కటే...
పాలు తేనెలు ప్రవహించు సారవంతమైన కనాను దేశాన్ని స్వతంత్రించుకొనుటకు పిలువబడినప్పుడు ఇశ్రాయేలీయులు ఆందోళన చెందినట్లు గమనించగలం. అక్కడ నివసిస్తున్న జనులను గూర్చి వారు విన్నప్పుడు వారు భయపడసాగారు. 40 సంవత్సరములు ప్రయాణం చేసి గమ్యం చేరే సరికి వారిలో ఎక్కువ శాతముమంది ఆ దేశములో ప్రవేశించడానికి ఇవ్వబడిన పిలుపును కూడా తృణీకరించారు. ఎందుకంటే, వారిని భయం వెంటాడుతుంది కాబట్టి.
అయితే యెహోషువ, కాలేబులు దేవునియందు నమ్మికయుంచమని బ్రతిమాలుతూ ఇలా అన్నారు, “ఆ దేశ ప్రజలకు భయపడకుడి... యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి.”(సంఖ్యా 14:9). అక్కడి ప్రజలు కనిపించడానికి ఎక్కువమందిలా ఉన్నా, ప్రభువు తమతో ఉన్నాడని నమ్మగలిగారు. వారి విశ్వాసమును బట్టే దేవుని గొప్పతనాన్ని ఆనాడు కళ్ళారా వీక్షించగలిగారు. తమ గమ్యాన్ని చేరుకోగలిగారు.
ఈరోజు ఎటువంటి భయం నిన్ను వెంటాడుతుంది? ఒక భయంకరమైన పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందేమో? ఒకవేళ నీ జవాబు అవును అని అయితే, భయపడవద్దు... దేవుడు నీతో ఉన్నాడు. భయం దేవుని నుండి దూరం చేస్తుంది, కాని దేవుడు ఆ భయం నుండే నిన్ను విడిపిస్తాడు, విడిపించగల సమర్ధుడు. ఆయనపై విశ్వాసముంచుము. ఆయన నిన్ను తప్ప నడిపిస్తాడు. భయం స్థంబింపజేస్తుంది, దేవునిపై విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసమున్నాక భయమెందుకు? నిరీక్షణయుంచుము. భయం తలుపుతడితే, విశ్వాసాన్ని మేల్కొలుపు అప్పుడు భయం పారిపోతుంది. ఎన్నడు ఎడబాయని ఆయన ప్రేమతో, విశ్వాసముతో మనము తప్పకుండా ముందుకు సాగిపోగలము. హల్లెలూయ. ఆమెన్.
https://youtu.be/UmScxe0JW80