యేసయ్య నీకు ఎవరు?


  • Author: Sairam Gattu
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

యేసయ్య నీకు ఎవరు?

మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును నీవు ఎందుకు నమ్ముకున్నావు? క్రీస్తునందు విశ్వాసం ప్రతి ఒక్కరికి ఒక్కో సందర్భంలో కలుగుతుంది. కానీ దాని కొనసాగింపు దేని మూలంగా కలుగుతోంది అన్నది చాల ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ప్రాథమికమయిన సువార్త ఏమిటీ? "సృష్టి కారకుడయినా దేవుడు మనుష్యులు పాపాలు చేసి, తన మహిమను కోల్పోతు, పాపం ద్వారా వచ్చే జీతము మరణమును పొంది, నిత్య నరకమునకు వెళ్లిపోతుంటే, వారిని ఆ పాపపు జీవితం నుండి రక్షించటానికి, తానూ మనిషిగా అవతరించి పాపం లేకుండా బ్రతికి, తన పవిత్ర రక్తమును క్రయధనముగా కార్చి, తన యందు విశ్వాసం ఉంచి తమ పాపములు ఒప్పుకొన్న వారిని క్షమించి, తన నీతిని ఆపాదించుట ద్వారా, వారికి నిత్య జీవమును అనగా తన సన్నిధిని అనుగ్రహిస్తాడు"

విశ్వాసము యొక్క ఆరంభము అనారోగ్యము నుండి స్వస్థత కావచ్చు, ఆర్థిక సమస్య నుండి విడుదల కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఆ మొదటి మెట్టు దాటినా తర్వాత అసలు విశ్వాసపు యాత్ర మొదలవుతుంది. దేవుడు సమస్యలను తీరుస్తాడు కనుక ఇంకా విశ్వాసంగా ఉన్నామా? లేదా దేవుడు ఆగ్రహిస్తాడని, తానూ చేసిన మేలులు తీసివేస్తాడేమోనని భయపడి కొనసాగుతున్నామా? లేదా మనం నిత్యం చేసే పాపాలను క్షమించాలి కాబట్టి విశ్వసిస్తున్నామా?

పైన చెప్పుకున్నట్లుగా యేసు క్రీస్తు తనయందు విశ్వాసము ఉంచి పాపములు ఒప్పుకొన్న వారికి తన నీతిని ఆపాదించి నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇది చాలామంది విశ్వాసము కొనసాగించటానికి కారణము. ఇందులో ఎంత మాత్రమూ తప్పులేదు, అనుమానం అసలు లేదు. యేసు క్రీస్తు ప్రేమకు అవధులు లేవు, అయన క్షమాపణకు హద్దులు లేవు.

యోహాను 6: "37. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును."

ఈ వచనములో యేసయ్య ఏమంటున్నాడు! తన యొద్దకు వచ్చిన ఎవరిని కూడా త్రోసివేయను అని సెలవిస్తున్నాడు. అయన ప్రేమకు షరతులు లేవు, అయన కరుణకు కొలమానం లేదు (మత్తయి 18:22 లో చదవండి). నిత్యమూ పాపములు ఒప్పుకుంటూ, క్షమాపణ కోరుతూ, అయన నీతిని వెతకటమే క్రైస్తవ విశ్వాసముగా పరిగణింపబడుతోంది. పాపములు ఒప్పుకున్నా వారినెల్ల క్షమిస్తూ కేవలం నీతిని ఇవ్వటానికే, దేవుడు క్రీస్తుగా భూమి మీదకి వచ్చి, 33 సంవత్సరాలు మనిషిగా బ్రతికి, పాపం లేకుండా జీవించి, ధర్మ శాస్త్రమును నెరవేర్చి, అన్ని బోధలు చేయవలసిన అవసరం ఏమిటి? మనిషిగా క్రిందికి వచ్చి, రక్తం కార్చి, మరణమును జయించి వెళితే సరిపోతుంది కదా? హనోకు, ఏలీయా వంటి వారిని దేహముతో పరలోకం తీసుకుని వెళ్ళిన దేవునికి దేహంతో భూలోకం రావటం అసాధ్యం కాదు కదా!

ఆయన క్షమించు వానిగానే కాదు నిజానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. దేని నుండి రక్షించటానికి? మనలో ఉన్న ఆదాము స్వభావము నుండి అనగా సాతాను మాట వినటం ద్వారా మనిషికి సంక్రమించిన సాతాను యొక్క లక్షణముల నుండి. దేవుని ఆజ్ఞను దిక్కరింప జేసే శరీర క్రియలనుండి రక్షించటానికి వచ్చాడు. మనవలె అన్నింట శోధించబడి కూడ దేవుని ఆజ్ఞలు అన్ని నెరవేర్చాడు అనగా పాపంలేని వాడిగా జీవించాడు. అందుకే మనకు బోధించాడు. అవి సాధ్యము కనుకనే వాటిని పాటించుమని నిబంధన పెట్టాడు. కానీ మనం ప్రతిసారి పడిపోతూ, క్షమించు తండ్రి అన్న దగ్గరే ఆగిపోతున్నాము.

దేవుడు తన కుమారుడయినా క్రీస్తును లోకానికి పరిచయం చేసింది, కేవలం అద్భుతాలు చేయటానికి, మేలులు చేయటానికి మాత్రం కాదు. అద్భుతములు చేసింది ఆయన మహిమను, ఆధిక్యతను తెలిపి మానవాళిని తన వైపు నడిపించటానికి. పాపం లేకుండా 33 సంవత్సరాలు జీవించింది వారికి మార్గదర్శిగా నిలవటానికి. కేవలం క్షమించటానికే అయితే, క్రీస్తు పరలోకం వెళుతూ ఆదరణ కర్తను అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించటం దేనికి?

అయన బోధనలు హృదయంలో నిలుపుకొని, ఒక్కొక్క శరీర క్రియ నుండి విడుదల పొందుతూ వాటి నుండి క్రీస్తు శక్తి ద్వారా రక్షించబడటానికి. కనుకనే అయన రక్షకుడిగా అవతరించాడు. లేదంటే క్షమాపణ కర్తగా మాత్రమే అవతరించేవాడు. క్రీస్తులో మన విశ్వాసం కొనసాగుతున్న కొలది మన హృదయాలలో అయన మేలులు చేసేవాడినుండి మొదలు పెట్టి మనకు క్షమాపణ కర్తవలే ఉంటూ రక్షకుడిగా రూపాంతరం చెందాలి. ఎందుకంటే చాల మంది విశ్వాసులు యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత కూడా ఆయనను పాపములు క్షమించే వానిగానే చూస్తున్నారు కానీ ఆ పాపములో పడిపోకుండా కాపాడే రక్షకుడిగా చూడటం లేదు.

గలతీయులకు 5: "19. శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను."

ఈ వచనములలో మన పితరుడు ఆదాము నుండి మనకు సంక్రమించిన సర్వ అవలక్షణాలు పేర్కొనబడ్డాయి. వీటిని నిత్యం చేస్తూ, అయ్యో నన్ను క్షమించు ప్రభువా అనుకుంటూ ఉంటే, అది విశ్వాసమా? యేసయ్యను నువ్వు రక్షకుడిగా నమ్ముకున్నావా? వీటిని చేస్తూ ఇతరుల ముందు నేను యేసయ్యను నమ్ముకున్నాను అని చెప్పి అయన నామమునకు అవమానం చేయటం కన్న, అయన గురించి చెప్పక పోవటమే ఉత్తమం.

క్రీస్తు ఇచ్చిన పరిశుద్దాత్మ శక్తి ద్వారా ప్రతి శరీర క్రియనుండి రక్షించబడుతూ నెమ్మదిగా ఆయన స్వభావమును పొందుకోవటమే యేసునందు విశ్వాసము కొనసాగటానికి కారణం కావాలి. ఎదుకంటే అయన వాటి నుండి మనలను రక్షించే రక్షకుడిగా అవతరించాడు, కానీ కేవలం క్షమించే వాడిగా మాత్రమే కాదు! క్షమాపణ పొందుకోవటం అన్నది ప్రాథమిక విషయము. మన యుద్ధము శరీర క్రియల పైన సాగాలి, అయన యందు విశ్వాసము ద్వారా, శక్తిని పొందుకొని వాటిని జయించాలి. తద్వారా మన పాపముల నుండి అయన ద్వారా రక్షించబడాలి. యేసయ్య నీ పాపములు క్షమించబడ్డాయి అని చెపుతూ ఏమని చెప్పేవాడు, మళ్ళి వాటిని చేయవద్దు అని కదా. అంటే పాపం లో ఎప్పటికి పడిపోమా? పడిపోవచ్చు, కానీ మన ప్రయత్నం ఎలా ఉంది? కేవలం క్షమాపణ ఉంది కనుక పర్వాలేదు అనుకుని పాపం చేస్తున్నావా? లేక శరీరము బలహీనతను బట్టి పడిపోతున్నావా? శరీర బలహీనత అయితే తండ్రి నాకు ఈ పాపం నుండి విడుదల ఇవ్వు, పాపంలో పడిపోకుండా నీ కృపను ఇవ్వు ప్రభువా అని పట్టుదలతో ప్రార్థిస్తే, తప్పక నీకు దేవుడు దాని మీద విజయం ఇస్తాడు. కానీ కావాలని, దేవుడు క్షమిస్తాడులే అని పాపం చేస్తే ఎప్పటికి దాని మీద విజయం పొందుకోలేవు, దేవుడు కోరుకుంటున్నా సంపూర్ణ విశ్వాసిగా మారలేవు.

పడిపోయిన ప్రతిసారి లేవాలి, మళ్ళి పడిపోకూడదు అన్న పట్టుదల రావాలి. కేవలం ఆలా అనుకుంటే సరిపోతుందా? ముమ్మాటికీ కాదు. పాపముల నుండి రక్షించే ఆయన సహవాసంలో ఉండాలి! వాక్యపు వెలుగులో మనలను మనం సరిద్దిదుకోవాలి, ప్రార్థన శక్తితో శోధనలు ఎదుర్కొనే బలం పొందుకోవాలి. "నేను ద్రాక్షావళిని, నాలో ద్రాక్ష తీగలవలె ఫలించమని" ఆయనే కదా చెప్పాడు. అందుకే ఎప్పుడు ఆయనను అంటి పెట్టుకుని ఉండాలి. అప్పుడే ఆయనలో ఉన్న శక్తి మనకు అనుగ్రహింపబడి వాటి మీద విజయం సాధిస్తాం.

సంపూర్ణ విశ్వాసిగా మారటానికి, యేసయ్యను నువ్వు క్షమాపణ కర్తగా చూస్తున్నావా లేదా దాన్ని దాటి రక్షణ కర్తగా చూస్తున్నావా? అనగా ప్రతి శరీర క్రియనుండి విజయాన్ని ఇచ్చే రక్షకుడిగా చూస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం నీ ఆత్మీయ స్థితిని తెలుపుతుంది, సంపూర్ణ విశ్వాసిగా అయనలో నిన్ను నిలుపుతుంది.

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!

 

https://youtu.be/5RfJJ9XNu0U