సంతోషించే రోజు


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

సంతోషించే రోజు

మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 16:20

లేఖనాలు ఈ సత్యాన్ని ధృవీకరిస్తూ “స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.” యోహాను 16:21. యేసు క్రీస్తు ప్రభువు వారు త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళతారని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు దుఃఖపడకుండా ఉండమని, ఒకనాడు ఆయనను మరలా కలుసుకున్నప్పుడు ఆ దుఃఖము సంతోషంగా మారే రోజు తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఆదరణకర్తయైన ఆత్మ వారితో ఉంటూ వారిని సర్వ సత్యములోనికి నడిపిస్తుందని ఈ ఉపమానం ద్వారా తెలియజేశాడు.

యేసు క్రీస్తు మరణ పునరుద్ధానములను ఉద్దేశించి ఈ మాటలు చెప్పారు. పునరుద్ధానుడైన తరువాత ఆయన ఆరోహనమై మరొకసారి వారిని విడిచి వెళ్లకముందు శిష్యులను సంతోషపెట్టే విధముగా యేసు మరి నలుబది రోజులు వారితో ఉండి వారికి బోధిస్తూ గడిపాడు. అయినా యేసు క్రీస్తు వారిని దుఃఖభరితులనుగా విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని మరింత ఆనందంతో నింపాడు.

యేసును మనమెన్నడు ముఖాముఖిగా చూడక పోయినా, విశ్వాసులముగా ఒకనాడు ఆయనను చూస్తామన్న నిశ్చయత మనకున్నది. ఆ దినమున ఈ భూమిపై మనం అనుభవిస్తున్న వేదనను మరచిపోతాము. అప్పటివరకు దేవుడు మనలను విడిచి పెట్టకుండా మనకు తన పరిశుద్ధాత్మను దయజేసి సంతోషాన్ని దయజేస్తున్నాడు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి దుఃఖము ఒకనాడు అది సంతోషంగా మారుతుందనే నిశ్చయత మనకున్నది. ఆయన ఎల్లప్పుడూ తన ఆత్మ రూపంలో మనతో ఉన్నాడు, మనలను ఎన్నాడుకూడా ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆమెన్.

https://youtu.be/fXRFkm4oHd8