దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం
ఒరేయ్ ఎక్కడున్నావ్ రా? అనే పిలుపు తప్ప తనతో మాట్లాడే సందర్భాలన్నీ... నా కుమారునికి చాలా ఇష్టం. వాడు ఎదో ఒక తుంటరి పని చేసి నాకు కనబడకుండా దాక్కోడానికి ప్రయత్నించినప్పుడే... ఆలా గట్టిగా పిలిచిన సందర్భాలు. తలిదండ్రులు బిడ్డల పట్ల కోపపడేది వారంటే ఇష్టంలేక పోవడం కాదు, బిడ్డలంటే అపారమైన ప్రేమ వారిని సరైన మార్గంలో పెంచాలనే ఆశ. బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తూ ఉంటారు.
ఆదాము,
హవ్వలు తోటలో దేవుని స్వరాన్ని వింటూ ఉండేవారు అంటే దేవునితో మాట్లాడుతూ ఉండేవాళ్లు. అయితే
దేవుడు వారికి విధించిన కట్టడలను వారు అనుసరించక తినకూడని పండు తిని దేవునికి అవిధేయులయ్యారు. ఒకరోజు వారిని "నీవు ఎక్కడ ఉన్నావు?" (ఆది 3:9) అని
దేవుడు పిలిచినప్పుడు,
ఆదాము భయపడి దాక్కున్నాడు. దేవునికి ఇష్టము లేని పని చేసినందున ఆయనను ఎదుర్కోడానికి ఇష్టపడలేకపోయాడు.
ఆదామును,
హవ్వను పిలిచిన
దేవుడు వారు తోటలోనే ఉన్నారని తెలిసినా తన పిలుపుకు ఎలా స్పందిస్తారో గమనించాడు.
దేవుడు, వారితో పలికిన మాటలన్నీ వారిని శిక్షించాలని కాక వారిని సరిచేయడానికి లేదా వారి చేసిన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే
దేవుడు వారి పట్ల తన కనికరాన్ని చూపిస్తూ, అపవాదిని శిక్షించి, రక్షకుని గూర్చిన వాగ్ధానంతో మానవాళికి నిరీక్షణను కూడా దయజేశాడు (ఆది 3:13-19).
ఏ సందర్భంలోనైనా మనం పొరపాట్లు చేసినప్పుడు,
దేవుడు మనకొరకు వెతకాల్సిన అవసరం లేదు. సర్వాంతర్యామియైన దేవునికి మనమెక్కడ ఉన్నామో,
ఏది దాయాలనుకుంటున్నామో
అన్ని తెలుసు. అయితే మనల్ని నిత్యం ప్రేమించే మన పరమ తండ్రి మన హృదయాలతో మాట్లాడుతూ, మనల్ని గద్దించి, సరిచేసి మనల్ని క్షమించి సమకూర్చాలనే తన ఉద్దేశం. మన పొరపాట్లును మనం తెలుసుకొని
మరలా వాటిని చేయక
దేవుడు పిలిచిన స్వరాన్ని వింటూ ఆయనకు లోబడాలనే అనుదినం ఎదురుచూస్తున్నాడు.
స్వచ్చమైన దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు సరిచేయడానికేనని గమనించాలి. దేవుని స్వరాన్ని విని లోబడే జీవితాలు అధికంగా ఆశీర్వదించబడుతాయి. అట్టి అనుభవం ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.