దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది!


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది!

సిరియా రాజు... ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండు పేటను సిద్ధపరచుకొని, చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలం బలగం ఇశ్రాయేలీయులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుఱ్ఱములు రథములు; గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు. 

మరోవైపు...పెందలకడనే లేచిన ఎలీషా పనివాడు, తమను చుట్టుముట్టారని తెలుసుకొని ఎలీషాకు కబురుపెట్టాడు. భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని (2 రాజులు 6:16) ఎలీషా చెప్పినప్పుడు ఆకాశమువైపు కన్నులెత్తి చూశాడు... పరలోక సైన్యం ఎలీషా చుట్టు పర్వతము వంటి అగ్ని గుఱ్ఱములచేత రథములచేత నిండియుండుట ఆశ్చర్యానికి గురిచేసింది. సిరియనుల ఆలోచనలు తారుమారయ్యాయి. కత్తి యెత్తలేదు విల్లు విరువలేదు ఇశ్రాయేలీయులు తప్పించబడ్డారు.

పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. ఎల్లప్పుడు విశ్వాసంతో జీవించే మనకు, ఒక వేళ నలు దిశలనుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు లేదా మనలను ముంచివేద్దాం అనేవారు మనలను సమాపించేలోపే దేవుడు మన చుట్టూ అగ్ని కంచె వేయగల సమర్ధుడు. మన టైం బాలేదు అని మనం అనుకుంటాం; అయితే, దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది. సమస్యలు మనలను చేరేలోపే దేవుడు దానికి పరిష్కారాన్ని సిద్ధంచేసి మనలను భద్రపరుస్తూనే ఉంటాడు. 

నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును (కీర్తన 91:11). మన అనుదిన జీవితంలో మనం నడిచే దారిలో, మనం ప్రయాణించే మార్గంలో, ఏ స్థితిలో మనమున్నా, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా... మనలను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా

దేవుడు మన పక్కన ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడల్లా పరిస్థితులు మనం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటాయి. ఆమేన్.


Telugu Audio: https://youtu.be/yBllIZJmzyo