అమ్మ


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini

అమ్మ

అమితమైన ప్రేమ, అంతులేని అనురాగం, అలుపెరుగని ఓర్పు, అద్భుతమైన సాన్నిహిత్యం, కనిపించే దైవం, కని పెంచే మాతృమూర్తి, అరుదైన రూపాన్ని మనకిచ్చే అపురూపమైన కావ్యం, చిరకాల జ్ఞాపకం,  ఎన్నడు వాడని మరుమల్లి,  అమృతం కన్నా తియ్యని ప్రేమలో... ప్రపంచం మనల్ని చూడక ముందే మనల్ని ప్రేమించినవారు ఎవరైనా ఉన్నారా అంటే... మన గుండె పలికే మొదటి మాట “అమ్మ”.

నాయకుడైన మోషే, యాజకుడైన ఆహారోను, మహిళా నాయకురాలైన మిరియాము;  తన ముగ్గురు బిడ్డలను దేవుని ప్రజల కొరకు ఏర్పాటు చేసిన తల్లి యోకెబెదు, దేవుని వాగ్దానాలు తన బిడ్డ జీవితంలో నెరవేరాలని బాల్యం నుండే నేర్పించి ప్రయాస పడిన తల్లి రిబ్కా, ప్రార్ధనలో పట్టుదల కలిగి...బిడ్డ పుట్టకముందే దేవునికి సమర్పించుకొని ఇశ్రాయేలీయులకు బలమైన ప్రవక్తను సిద్ధపరచిన తల్లి హన్నా, నీవు గోడ్రాలివని సమాజం అంటే, దేవునిపై భారం వేసి, దైవాజ్ఞకు లోబడి సంసోను వంటి న్యాయాధిపతిని ఇచ్చిన తల్లి వంటి ఎందరో తల్లుల గురించి ఎంత చెప్పిన తక్కువే, ఎంత తలచినా మధురమే. లోక రక్షకుని మనకొరకు కని పెంచిన పరిశుద్దురాలు తల్లి మరియను జ్ఞాపకము చేసుకోవటము మనకెంత భాగ్యము, ఎంత ఆశీర్వాదము.

“నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” (నిర్గమ 20:12) అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. “మాతృదేవోభవ” అనేది మన దేశ సంస్కృతి. “కనిపించే తల్లి అంటే కనిపించే దైవం” అనేది కవుల భావన. ఏది ఎలా ఉన్నా...నవమాసాలు భరించి, కష్టపడి ఊపిరి పోసి, ఉగ్గుపాలల్లో పంచప్రాణాల సారాన్నీ, గోరుముద్దల్లో కోటి ఆశల రూపాన్ని రంగరించి కరిగించి, తమ కల పంటలు పండాలని కోరుకుంటూ తాను పొందలేని ఆనందానుభూతులను మనతో పంచుకునే నా తల్లికి, తల్లులందరికి హృదయపూర్వకంగా “హ్యాపి మదర్స్ డే”.

Telugu Audio: https://youtu.be/Xs4Cj3a_ixk