సాహస ప్రయాణం
యెషయా 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు
క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉంటుందో ఈ వాక్యంలో కనిపిస్తుంది. కొంతమంది నాకే ఎందుకు ఈ శ్రమలంటారు. మరి కొంతమంది నాకు శ్రమలు ఎక్కువగ ఉన్నాయంటారు. శ్రమలెక్కువ, శ్రమలు తక్కువని కాదు శ్రమలతో కూడినదే క్రైస్తవ జీవితం. కొంతమంది శ్రమలలో ఉన్న వారితో; నాకెప్పుడు ఇలాంటి శ్రమలు రాలేదు నీకే ఎందుకొస్తున్నాయి? నీ ప్రార్ధనలలో లోపం అనుకుంటా? సరిగ్గా ప్రార్ధన చేసుకొనమని బలహీనపరచే మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది శ్రమలలో ఉన్నవారికి సలహాలు ఇస్తారు. ఒకరు శ్రమలో ఉన్నవారికి సలహాలు ఇస్తున్నారంటే వారికి శ్రమలు లేవని కాదు. ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి. అందుకే
క్రీస్తుతో మనం చేస్తున్న ప్రయాణం సాహస ప్రయాణం అని నా ఉద్దేశం.
మనం చదివిన లేఖన భాగంలో జలములు, నదులు, అగ్ని కనిపిస్తుంది. మనం వీటిని దాటుకుంటు ప్రయాణం చేయాలని వాక్యం చెప్పుతుంది. మనం శ్రమలను తీసివేయమని ప్రార్ధన చేస్తాము కాని,
దేవుడు శ్రమలలో తోడుంటానని చెప్పుతున్నాడు. దేవునిపై విశ్వాసం ఉంచితే జలముల వంటి శ్రమలు వచ్చినా నీవు మునిగిపోవు. నదుల వంటి శ్రమలు వచ్చిన నిన్ను ముంచివేయవు. అగ్నివంటి శ్రమలు వచ్చిన నిన్ను కాల్చివేయలేవు ఎందుకనగా,
దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
సమస్యలలో ఉన్నప్పుడు ప్రతి యొక్కరు ఇచ్చే సలహా ప్రార్ధన చేసుకొనమని చెప్తారు. ప్రార్ధన ఒక్కటే చేస్తే సరిపోదు, ప్రార్ధనతో పాటు సహనం ఉండాలి. ఎందుకనగా, విశ్వాస జీవితం పరీక్షలతో కూడినది. సమస్యలలో ఉన్నప్పుడు ప్రార్ధిస్తే దేవుని నుండి సహాయం వస్తుంది కాని, ఆ సహాయం ఎప్పుడొస్తుంది, ఎంత సమయం ఎదురు చూడాలో తెలియదు కాని, ఎదురు చూడాలి; అంతకు మించి వేరే మార్గం లేదు.
యోబునకు శ్రమలు కలిగాయి, శ్రమలు సహించి రెండంతలు ఆశీర్వాదం పొందుకున్నాడు కాని, ఎన్ని దినములు శ్రమలను అనుభవించాడో తెలియదు. న్యాయాధిపతుల గ్రంథములో
ఇశ్రాయేలీయులు దేవుని మాట వినక శత్రువు చేతిలో ఓడిపోయి, తప్పు తెలసికొని దేవునికి మొఱ్ఱపెట్టగా విడిపించాడు కాని,
దేవుడు ఎన్ని దినములకు వారిని విడిపించాడో తెలియదు.
దేవుడు విడిపిస్తాడు కాని, ఎప్పుడు విడిపిస్తాడో తెలియదు. కాని, తగిన సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. మన నమ్మిన యేసయ్యకు చెవుడు లేదు,
సోమరివాడు కానేకాదు.
ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు.
ప్రతి శ్రమలో
దేవుడు తోడుగా ఉంటానని వాగ్ధానం చేసాడు. ప్రతి శ్రమ తరువాత ఆశీర్వాదం ఉంటుంది. అబ్ర
హాము ఎదుర్కొనిన ప్రతి శ్రమ తరువాత కచ్చితముగ ఆశీర్వాదం పొందుకున్నాడు. శ్రమలో నమ్మకముగ ఉంటేనే ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు.