నీవు దేవుని బంగారం
యోబు 23:10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.
ఒకసారి ఇంటికి అతిథులు వస్తున్నారని ఆ కుటుంబికులంతా ఇంటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ఒకొక్కరు ఒకొక్క గదిని శుభ్రపరుస్తున్నారు. వారి పనులు మానుకొని ఇలా చేయుటకు కారణం, వారి ఇంటికి వచ్చే అతిధే. ఇంటికి వచ్చే అతిధి విలువును బట్టి వారికిచ్చే మర్యాదలు ఆధారపడి ఉంటాయి.
అలాగుననే పరలోకంలో నీకు మర్యాదలు కావాలంటే, నీకు కావలసినది విలువ. పరలోకం ప్రవేశించుటకు బంగారమునకే అవకాశం ఉంది. నీవు దేవుని బంగారమైతేనే పరలోకంలోనికి అడుగుపెట్టగలవు. నీవు ఈ లోకంలో బంగారంగా
మారాలంటే ఒకే ఒక మార్గం శోధన, శ్రమల మార్గం.
యోబు ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టే తాను వెళ్తున్న ఆ కష్టమైన మార్గంలో సహనము కలిగి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు నాలో మెరుగు లేదేమో, నాలో
దేవుడు ఆశించిన శుద్ధిలేదేమో కాని, ఈ పరీక్షలు ముగిసిన తరువాత నా జీవితం బంగారం వలే మెరసిపోతుంది, బంగారం వలే సుందరంగా కనిపిస్తానని
యోబు ఆశ కలిగియున్నాడు.
(1
పేతురు 1:7) కంసాలి పాడైపోతున్న బంగారాన్ని అగ్ని చేత శుద్ధి చేసినట్లగా, బంగారంకంటే అమూల్యమైన నీ విశ్వాసమును శోధనలచేత, శ్రమల చేతనే
యేసుక్రీస్తు శుద్ది చేస్తున్నాడు. ఈ లోకంలోని భయాలచేత, వాగ్ధాలపై సందేహాలతో, దేవునిపై అనుమానాలతో, అవసరంలేని ప్రశ్నలతో విశ్వాసములో స్థిరపడలేకపోతున్నావేమో; నీ అమూల్యమైన విశ్వాసమును శుద్ధి చేయుటకే
దేవుడు శ్రమలలో నిన్ను పరీక్షిస్తున్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు నిరుత్సాహపడకు నీవు దేవుని బంగారానివి. నీవంటే ఇష్టం లేక కాదు, నిన్ను పరలోకంలోనికి చేర్చుటకే
దేవుడు మెరుగుపరుస్తున్నాడు.
శ్రమలలో, శోధనలలో ఉన్నప్పుడు నాకే ఎందుకని,
దేవుడున్నాడా అని ప్రశ్నలు వేయకుండా
యోబు వలే ఈ పరీక్షల తరువాత నేను బంగారము వలే కనబడుతానని నిరీక్షణ కలిగియుండు తప్పక ఒక దినము హెచ్చించబడతావు.