విశ్వాస రహస్యం
నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మా ఉపాధ్యాయుడు ఒక విషయం చెప్తూ ఉండేవాడు - జీవితం అంటే జిలేబి కాదు, ముళ్ళున్న గులాబి అని. వాస్తవమే కదా! అందమైన గులాబి పువ్వుకు ముళ్ళు ఎలా ఉంటాయో, అందమైన జీవితంలో శ్రమలు కూడా తప్పవు. చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు నాకే ఎందుకు కలిగింది అని బాధపడడం కంటే వాటిని పట్టుకున్నప్ప్పుడే కదా రాబోయే శ్రమలను తట్టుకునే శక్తిని, అనుభవాన్ని పొందగలం. శ్రమ, సంతోషం ఈ రెండూ మన జీవితంలో రెండు కళ్ళలాంటివి; ఏ ఒక్కటి లేకున్నా జీవితం మనకు అందంగా కనబడదు.
శ్రమల నడుమ ఉన్నప్పుడు, ఆ శ్రమ విచారము వలన కావచ్చు,
అనారోగ్యం వలన కావచ్చు లేదా "మన" అనే వాళ్ళే మనల్ని మోసం చేసియుండ వచ్చు. ఈ శ్రమ మనకు క్రుంగుదలతోపాటు కొంత భయాన్ని కూడా జతచేసి మనల్ని ఒంటరితనంలోనికి నెట్టేస్తుంది. ఇంకెంత కాలం నాకీ కష్టాలు అని అనుకునే వారు ఎవరు లేరు చెప్పండి. నేడు ఉన్న కష్టం రేపు కూడా ఉండవచ్చు కాని మనలో ఉండే ఓర్పు, సహనమే తప్పక ఒకరోజు ఆనందం వైపు నడిపిస్తుంది. మనలో ఉండే పట్టుదలతో పాటు దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా నిజమైన శాంతిని పొందగలం. ఇదే క్రైస్తవ విశ్వాస రహస్యం.
ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి శ్రమలను అనుభవిస్తున్నామో ఆయనకు
అన్నీ తెలుసు. క్షణమాత్రముండు మన చులకని శ్రమనుండి శాంతిమార్గములోనికి నడిపిస్తుంది దేవుని అపారమైన కృప. ఆయనపై విశ్వాసం ఎంత
లోతుగా ఉంటే అంతటి పూర్ణ శాంతిని మనం పొందగలం. అందుచేత మన ప్రతీ శ్రమలో ఆయనయందు విశ్వాసముంచి మొఱ్ఱపెట్టడం నేర్చుకోవాలి. దేవునిపై ఆనుకొని సంపూర్ణంగా ఆధారపడిన జీవితాల్లో ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే భక్తుడంటాడు,
యెషయా 26:3 లో “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.