ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.
కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు.
హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
జీవితములో బాధకరమైన పరిస్థితి ఆశాభంగం, సిగ్గుపడే పరిస్థితి. అనగా, చేయగలనని నమ్మకముతో ముందుకు వెళ్ళి చేయలేక నవ్వులు పాలైన పరిస్థితి. నిన్ను ఓర్వలేక కావాలనే నీకంటే కింద స్థాయి వ్యక్తిని నీపైన అధికారిగా పెట్టినప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఎదురౌతుంది. అందుకనే
దావీదు నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుమని ప్రార్ధించాడు.
పౌలు అయితే నాకు కలిగిన శ్రమలలో
దేవుడు విడిపిస్తాడని నిరీక్షణ కలుగియున్నాను కాబట్టి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని చెప్తున్నాడు.
పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం ఊహించలేము.
దావీదు కుమారుడైన
అమ్నోను తన సహోదరిని చెరిపాడు.
దావీదుని తన కుమారుడే చంపుటకు వచ్చినప్పుడు రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు.
దావీదు ఉపపత్నులను అందరు చూస్తుండగ తన కుమారుడైన
అబ్షాలోము చెరిపాడు. ఈ పరిస్థితులలో
దావీదు గురించి
ఇశ్రాయేలు ప్రజలు ఏవిధముగ మాట్లాడుకున్నారో బైబిల్ లో వ్రాయబడిలేదు కాని, ఎక్కడ చూసిన
దావీదు కుటుంబము గురించి తెలిసి తెలియక రకరకాలుగా మాట్లడుకొనియుండి ఉంటారు.
దావీదు జీవితములో ఇది అవమానకరమైన, సిగ్గుకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుండి భయటకు వచ్చే అవకాశమే లేదు. తప్పు చేసిన
దావీదు పశ్చాత్తాపపడి దేవుని మీద నిరీక్షణ కలిగియున్నాడు. ఆ నిరీక్షణ
దావీదును సిగ్గుపరచలేదు కాని తిరిగి అదే రాజ్యం మీద రాజుగా పరిపాలన చేసాడు.
ప్రియ విశ్వాసి! అనుకోని పరిస్థితుల వలన శ్రమలలో చిక్కుకున్నావా? నీ శత్రువు నీ పైన అధికారం చెలాయిస్తున్నాడా? నిందలకు, అవమానముల వలన తలదించుకున్నావా? భయపడకు అద్భుతమైన వాగ్ధానం నీకొరకు ఉంది. సామెతలు 23:18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
కీర్తన 22:4-5 మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
ప్రతికూల పరిస్థితులలో దేవుని పైన నమ్మకము ఉంచుటవలన రక్షణ కలుగుతుంది, విడుదల పొందుకుంటాము, సిగ్గుపడే పరిస్థితి నుండి విడిపించబడతాము. ఒకవేళ నీకున్న సమస్తము కోల్పోవచ్చు. ఆరోగ్యం, ఆస్తి, ఆత్మీయ జీవితం మొదలగు
అన్నింటిలో క్షీణించిపోవచ్చు కానీ,
క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే తిరిగి పొందుకుంటాము. మన నిరీక్షణకు ఆధారం యేసే.