ప్రార్ధన యొక్క ప్రాధాన్యత


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

ప్రార్ధన యొక్క ప్రాధాన్యత

"దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?" లూకా 18:7

DL మూడి అనే దైవజనుని కొంత మంది ప్రశ్నించారట మీ విజయ రహస్యమేమిటని? 
దానికి ఆయన 7 కారణాలున్నాయి అని చెప్తూ... 1. ప్రార్ధన 2. ప్రార్ధన 3. ప్రార్ధన 4. ప్రార్ధన 5. ప్రార్ధన 6. ప్రార్ధన 7. ప్రార్ధన అని చెప్పారట. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రార్ధన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో? విసుగక పట్టుదలతో ప్రార్ధించిన ఆ ప్రార్ధనా వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు.

లూకా సువార్త 18:1-7 వచనాలు చూస్తే యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది.
ఒక న్యాయాధిపతి వున్నాడు. అతడు అన్యాయస్తుడు, అతనికి దేవుడంటే భయంలేదు, మనుష్యులంటే లెక్కలేదు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక,పట్టువిడువక, మాటి మాటికి వస్తున్న సందర్భములో, అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట. అన్యాయస్తుడైనవాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, న్యాయవంతుడైన దేవుడు, నీ నా కోసం తన చివరి రక్తపుబొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్ధన ఆలకింపడా?

ప్రార్ధించే మనము దేని నిమిత్తం ప్రార్దిస్తున్నామో? దానిని పొందుకొనేవరకు ప్రార్ధించాలి. మనము కొద్ది రోజులు ప్రార్ధించి విసిగిపొతాము. అయితే, ఒక విషయం అర్ధం కావాలి. విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తం అయితే ప్రార్దిస్తున్నామో? దేవుడు దానిని మనకోసం సిద్ధపరచే సమయంలో, విసిగిపోయి ఇక మన ప్రార్ధనకు సమాధానంరాదు అనుకొని, ప్రార్ధించడం మానేస్తాము. అందుకే, అనేక ప్రార్ధనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము. విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో గాని, అలక్ష్యము చెయ్యడు. ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగివుంది అనే విషయం మరచిపోవద్దు. ఎప్పుడు మనకు ఏమి కావాలో? నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం గుర్తుంచుకో.

సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 45 సంవత్సరాలు పట్టింది. తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే, పొందుకొనేవరకు విసుగక పట్టుదలతో ప్రార్ధించాలి.  ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు! అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక..! ఆమెన్!

Telugu Audio: https://youtu.be/aEV1QuBYnvY