అధైర్యం అధిగమిస్తే విజయోత్సవమే
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు మనకో సంకేతాన్నిస్తున్నాయి, అవి లేసి పడుతున్నందుకు కాదు పడినా లేవగలననే శక్తి దానికి ఉంది కాబట్టి. నీ
దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. సాధించలేకపోయానని నిరాశ చెందవద్దు. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించనప్పుడు నీ ఓర్పు, సహనం నీకు తప్పక విజయాన్ని చేకూరుస్తాయి.
అపజయాలు ఎదురయ్యేకొద్దీ సహనం కోల్పోవచ్చు. అధైర్యం అసహనం - అవి మనం చేరుకోబోయే గమ్యాన్ని, పొందాలనుకునే విజయాలను ఆటంకపరుస్తాయి. మనల్ని నిరుత్సాహపరిచే అపజయాలు మన బలహీనతలైతే; లక్ష్యాన్ని సాధించాలనే మన ఆలోచనలు మన బలహీనతకంటే బలమైనవిగా ఉన్నప్పుడే అది విజయమైనా లేదా చేరుకోబోయే గమ్యమైనా మనల్ని చేరువవుతుంది. ఓపిక ఉన్నంతవరకుకాదు, ఊపిరి ఉన్నంతవరకు పోరాడగలిగినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఋజువు చేయగలం.
జీవితం మనకు
ఏది ఇవ్వదు, మనమే సాధించుకోవాలి. అనుకున్నది సాధించాలంటే ధైర్యం కావాలి. అధైర్యాన్ని అధిగమించాలంటే
క్రీస్తు మనతో ఉండాలి. ఈ సంవత్సరం గతించిపోతూ నూతన సంవత్సరం సమీపించుచున్నది గనుక ఒక తీర్మానం తీసుకుందాం; ప్రార్ధనలో, వాక్యంలో ఇంకొంత సమయం గడుపుతూ దేవునికి ప్రధమ స్థానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం.
యాకోబు 4: 8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును. ఆయన మనతో ఉంటేనే కదా మన జీవితంలో విజయోత్సవాలు. విశ్వాస ప్రార్ధన ద్వారా అట్టి తీర్మానమును ప్రభువు స్థిరపరచును గాక.
ఆమేన్.