దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి

ఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే  తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెరిగి పెద్దై ఎంత సమూహంలో ఉన్నా గుర్తించగలుగుతాడు. తల్లి పరిచయం చేయడం ద్వారా తండ్రి, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య మొదలైన బంధువుల స్వరాలను తెలుసుకుంటాడు.

హన్న తన కుమారుడైన సమూయేలును పాలు విడిచిన తరువాత  యెహోవాకు ప్రతిష్టించినప్పటినుండి యెహోవా సన్నిధిని ఉండి  ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమవటం అరుదుగా ఉన్న రోజుల్లో ఒక రాత్రి  బాలుడైన సమూయేలును దేవుడు పిలిచాడు, మూడుసార్లు మాట్లాడాడు. మాట్లాడిన ప్రతిసారి సమూయేలు ఆ స్వరం ఏలీదనుకున్నాడు. అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడాలని, ఆయన స్వరం వినిపించాలనుకుంటున్నాడని ఏలీ  గ్రహించి సముయేలుతో "ఎవరైన నిన్ను పిలిచినయెడల యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పు" అని చెప్పమన్నాడు. సమూయేలు ఆలకించి, ఆఙ్ఞ ఇమ్మనగానే వినేవారి చెవులు గింగురుమనేలా దేవుడు మాట్లాడాడు.

నీవు ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యధ్యానం  చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నావా! తల్లి స్వరాన్ని బిడ్డ ఏవిధంగా వినగలుగుతున్నాడో ఆ విధంగా దేవుని స్వరం వినగలుగుతున్నావా! 
ఆయన  నిన్ను పిలుస్తున్నాడు. అనుదిన జీవితంలో మనం సాధించాలనే ప్రతి విజయాలు మరియు పొందబోయే బహుమాలను, తన స్వరాన్ని విని అనుసరించే ప్రతి ఒక్కరికి దయజేయాలనుకుంటాడు. దేవుని ఉన్నతమైన పిలుపుకు ప్రతిస్పందిస్తే  మనలను ఆయన స్వరూపంలోనికి మార్చుకుంటాడు. యేసు క్రీస్తు, తన పరిచర్య కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఈ వాక్యమును చదువుతున్న నీవు కూడా తన ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తుడివే. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను (ఆది 5:24). ఏలియా దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టే ఆకాశమునకు ఆరోహణమయ్యాడు (2 రాజులు 2:11). 

ఫిలిప్పి 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

Telugu Audio: https://youtu.be/vT0LZxxcaWo