దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.

ప్రార్ధన చేయాలన్న ఆశతో ఉన్న ఒక సహోదరి ఖాళీగా ఉన్న కుర్చీని లాగి దానిముందు కూర్చొని మొకాళ్ళూనింది. కన్నీళ్ళతో ఆమె, “నా ప్రియ పరలోకపుతండ్రీ, ఇక్కడ కూర్చొనండి; మీరు-నేను మాట్లాడుకోవాలి” అన్నది. ఆ తరువాత ఖాళీగా ఉన్న కుర్చీవైపు నేరుగా చూస్తూ ప్రార్ధన చేసింది. ప్రభువును సమీపించడంలో ఆమె ధైర్యాన్ని కనబరచింది. ఆయన కుర్చీలో కూర్చున్నట్టు ఊహించి, తన మొరనాలకిస్తున్నట్టు విశ్వసించింది.

సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉండేటట్లు చేసే ప్రాముఖ్యమైన తరుణమే దేవునితో మనం గడిపే సమయం. యాకోబు 4:8 ప్రకారం “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”. ఒక పరస్పర ప్రక్రియగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరికి తప్పకుండా వస్తాడు. “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను”(మత్తయి 28:20) లో యేసు క్రీస్తు తన శిష్యులకు అభయమిచ్చాడు. మన పరలోకపుతండ్రి మనము చెప్పేది వినడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నవాడై, అనునిత్యము మనము ఆయన దగ్గరికి రావాలని ఎదురుచూస్తున్నాడు.

మనకు అలసటగా, నిద్రగా, అనారోగ్యముగా ఉండి ప్రార్ధించడానికి మనము పెనుగులాడే సమయాలుంటాయి. హెబ్రీ 4:15-16 లో చెప్పబడినట్టు “. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు… గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము”. 

మనం బలహీనులముగా ఉన్నప్పుడు, శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు యేసయ్య మనలను అర్ధము చేసుకుంటాడు. దేవుడు ప్రతి చోటా ప్రతి సమయంలో మనకు అందుబాటులో ఉండి మనం తనతో పంచుకునే మాటలను వినడానికి ఎల్లపుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు సమీపంగా వచ్చినప్పుడు బలహీనతలను అధిగమించి పొందిన బలం ద్వారా మనం ఎదుర్కొనే శోధనలపై విజయవంతులముగా చేయబడుతాము అనుటలో ఎట్టిసందేహము లేదు. దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ మన జీవితంలో విజయోత్సవాలే కదా! ఆమెన్.

Telugu Audio: https://youtu.be/wFP_ZnK5fN4