శ్రమకు బాధకు ముగింపు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

శ్రమకు బాధకు ముగింపు

యెషయా 33:17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.

ఒకనాడు మనందరికీ ఆ నిత్యరాజ్యంలో మన నీతి సూర్యుడైన యేసు క్రీస్తు సౌందర్యమైన ముఖదర్శనం చూడగలమనే నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ కేవలం నైరూప్య భావన మాత్రమే కాదు, ఈ రోజు మనం మన జీవితాల్లో అనుభవించగల సజీవ వాస్తవికత అని గ్రహించాలి.

మన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినప్పుడు, మనం పొందుకునే బహుమానం నిత్యజీవం. అంతే కాదు, ఆ నిత్యరాజ్యంలో ఇక ఎన్నడు శ్రమ, బాధ, మరణం ఉండదనే వాగ్దానం కూడ పొందుకున్నాము. ఆ రాజ్యంలో మన యేసయ్యను అధికమైన నిత్య మహిమలో, పరిపూర్ణమైన ప్రేమ, కృప మరియు దయలో ఆయనను వీక్షించగలము.

అవును, పరలోకంలో మనం పొందుకోబోయే నిరీక్షణ ఎట్టిదో, ఈ రోజే మన దైనందిన జీవితంలో ఆ నిరీక్షణను అనుభవించవచ్చు. మనం ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, ఆరాధించేటప్పుడు, మనం యేసు క్రీస్తు యొక్క మహిమను వ్యక్తిగతంగా అనుభవించవచ్చు. మనం ఆయనను వెతుకుతున్నప్పుడు, ఆయనను గూర్చి మరింత తెలుసుకుంటాము మరియు ఆయన మనకు వాగ్దానం చేసిన సమృద్ధిగల జీవితాన్ని అనుభవిస్తాము.

ఈరోజు, యేసు క్రీస్తుపై మన కన్నులను నిలిపి, మహిమలో ఆయనను చూసే రోజు కోసం ఎదురుచూద్దాము. మనం ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన తనను తాను వెల్లడిస్తాడని విశ్వసిస్తూ, మన దైనందిన జీవితంలో ఆయన మహిమను అనుభవించడానికి కూడా ప్రయత్నిస్తాము. మన నిరీక్షణ కేవలం ఈ జీవితానికి మాత్రమే కాదు, మన రారాజు సన్నిధిలో ఆయనతో శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

అనుదిన వాహిని.
Telugu Audio: https://youtu.be/7tfXq5owZcU