సృష్టి పరిమళాలు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

సృష్టి పరిమళాలు

ఒకరోజు నేను హిమాలయా పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన లోయలు, నదులు, జలపాతాలను వీక్షించాను. దేవుని అద్భుతమైన సృష్టి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవనించింది. ఫోటోల్లో లేదా విడియోల్లో చూడడం కంటే నేరుగా ఆ ప్రదేశాల్లో నడిచి వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. అలా 3900 మీటర్ల ఎత్తుకు అధిరోహించినప్పుడు చక్కని గడ్డి మైదానంలో ఒక అపురూపమైన పూల మొక్కను గమనించాను. ఈ ప్రత్యేకమైన పువ్వును మునుపెవ్వరూ చూడలేదని, ఇక దానిని ఎవ్వరూ చూడబోరని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎవరు చూడలేని ప్రదేశంలో ఇంత రమ్యతను దేవుడు ఇక్కడెందుకు ఉంచాడు? అని నాకు అనిపించింది.

ప్రకృతి ఎప్పుడు వృధాగా ఉండదు. అది దాని ఉనికినిలోనికి వచ్చిన వాని గురించిన సత్యాన్ని, మంచితనాన్ని, సౌందర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రతిరోజు ప్రకృతి దేవుని మహిమను నూతనంగా, తాజాగా ప్రకటిస్తుంది. ఆ సృష్టి అందాన్ని రూపించిన సృష్టికర్తను చూస్తున్నామా, లేదా ఊరికనే అల చూసి ఉదాసీనంగా దులిపేసుకొని  వెళ్ళిపోతున్నామా?. 

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది (కీర్తన 19:1). సృష్టి పరిమళాలు నాసికలకు తగిలినప్పుడు, ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే!. సొగసులు పరిమళించే పువ్వు యొక్క తేజస్సును, లేలేత కిరణాలతో మెరుస్తున్న సూర్యోదయ  వైభవాన్ని, ఎగిసిపడుతున్న ధ్వని రాగాల సముద్ర కెరటాలు, పక్షుల కువకువలు లేదా ఆకాశాన్ని తాకే చెట్ల వంటి అపురూపాలను మనం చూసినప్పుడు మన హృదయం ఆరాధనాతో నిండి కృతఙ్ఞతతో ప్రతిస్పందిస్తాము. 

పర్వత శిఖరాలపై అధిరోహించినప్పుడు కృతజ్ఞత కలిగిన జీవితం ఎలా ఉండాలో నేను ఆ సృష్టిని చూసే నేర్చుకున్నాను.  బొట్లుబొట్లుగా జారే నీటిబిందువులు, కరిగే మంచు ధారల కలయికలు ఏకమై, పర్వతాల దిగువ నున్న అందమైన జలపాతాలుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి, చిన్నచిన్న విషయాలలో కృతజ్ఞత మన రోజువారి జీవితంలో చూడగలిగితే మనం జీవించే జీవితకాలమంతా దేవుడు సౌందర్యంగా అపురూపంగా చేయగలడు.

ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించే జీవితాలుగా ప్రభువు మనందరినీ స్థిరపరచి ఆశీర్వదించును గాక. ఆమెన్

Telugu Audio: https://youtu.be/L2iCAWjcUcI