మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనములు.
నేడు అనేక మంది ఒకటి పాపం, తప్పు అని తెలిసినప్పటికీ దానిని విడిచిపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామంటూ, యవ్వనస్తులు కొన్ని పనులు చెయ్యడం పాపం అని తెలిసినా కూడా వాటిని విడిచిపెట్టకుండా అలానే పాపాన్ని పెంచి పోషిస్తున్నారు.
(ఉదాహరణకు: మద్యం త్రాగటం పాపం అని తెలుసు కాని అలానే తాగుతారు. నీలి చిత్రాలు చూడటం పాపం అని తెలుసు కాని చూస్తారు. బలులు అర్పించిన వాటిని తినకూడదు అని తెలుసు కాని స్నేహితులతో కలిసి తింటారు. ఇలా పాపం అని తెలిసినా వదిలిపెట్టకుండా చేసేవి చాలా ఉన్నాయి. )
ఒక రోజు ఒక ఉపాద్యాయుడు కొంతమంది విద్యార్థులను ఒక తోటలోనికి తీసుకొని వెళ్లి రెండు రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి దానిని పెరికివెయ్యండి అని అడిగాడు, ఒక విద్యార్థి వెంటనే వచ్చి మొక్కను తీసేసాడు. వారం క్రితం నాటిన మొక్కను చూపించి దానిని కూడా తీసివెయ్యమని అడిగాడు, దానిని కూడా సులభముగా తీసేసాడు. నెల క్రితం నాటిన మొక్కను చూపించాడు, దానిని కూడా కాస్త కష్టపడి తీసేసాడు ఆ విద్యార్థి. అలా ఒక సంవత్సరం క్రితం నాటిన మొక్కను చూపించాడు, అది ఇప్పుడు బాగా పెద్ద వృక్షం అయ్యింది, దానిని తీసివెయ్యి అని అడిగాడు ఉపాద్యాయుడు. అప్పుడు ఆ విద్యార్థి దానిని తొలగించడం నా వల్ల కాదు అన్నాడు.
ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆ విద్యార్థి అప్పుడే పెరిగిన మొక్కలను, లేత వయసు గల మొక్కలను తొలగించగాలిగాడు, కాని చాలా కాలం నుండి పెరిగి పెద్దదిగా మారిన వృక్షాన్ని తొలగించలేకపోయాడు. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం అది ఒక మొక్క, ఇప్పుడు అది ఒక చెట్టు, అది భూమిలో బలముగా నాటుకుపోయింది.
అదే విధముగా మన జీవితములో కూడా పాపం అని తెలిసిన వెంటనే దానిని తొలగించడం సులభం. అల కాకుండా తాత్కాలిక ఆనందం కోసం ఆ పాపాన్ని పెంచి పోషించి నప్పుడు అది పెరిగి పెద్దగా అయ్యి హృదయంలో బలముగా నాటుకుపోతుంది.
ఆ పాపానికి బానిసలుగా మారిపోతారు.
ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది. (సంఖ్యా 32:23)
నువ్వు పెంచి పోషించిన ఆ పాపమే నీ జీవితాన్ని చిక్కుల్లో పడవేస్తుంది, నాశనం చేస్తుంది (హెబ్రీ 12:2)
ఆ పాపమే నిన్ను బంధకములతో కప్పివేస్తుంది. (సామెతలు 5:22)
చివరకు ఒక దినాన ఆ పాపం యందు ఎటువంటి సంతోషం లేదని తెలుసుకొనే పాటికి (ప్రసంగి 12:1) ఆ పాపం నుండి విడిపించుకోలేక, పాపానికి బానిసలుగా మారిపోయి, చిక్కులలో పడిపోయి (హెబ్రీ 12:2) దేవునికి దూరం అయ్యి, ఆశీర్వాదాలు కోల్పోయి, జీవితంలో శాంతి సమాధానం లేక, తెలిసి చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తూ రోదిస్తూ ఏడుస్తున్నవారు కొందరు అయితే, ఆత్మ హత్య చేసుకొన్నవారు కొంతమంది.
ఈ సందేశం చదువుతున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా నువ్వు కూడా అట్టి స్థితిలోనికి దిగజారక ముందే జాగ్రత్త పడు. నువ్వు కూడా ఒకటి పాపం అని తెలిసాక కూడా, దానిని విడిచిపెట్టకుండా తాత్కాలిక ఆనందం కోసం పాపాన్ని పెంచుతున్నావా? అయితే జాగ్రత్త సుమా!
నీ జీవితములో దుఃఖకరమైన దినములు, వేధనకరమైన రోజులు రాకముందే ఆ పాపం యందు ఎటువంటి సంతోషం లేదని చెప్పే దినములు రాకముందే, యేసయ్యకు నీ హృదయంలో చోటివ్వు (ప్రసంగి 12:2)
నువ్వు చేస్తున్నది ఏదైనా తప్పు, పాపం లేదా వాక్య విరుద్ధమైనదిగా అనిపిస్తే దానిని వెంటనే విడిచిపెట్టు. అది చెడు స్నేహం కావచ్చు, వ్యభిచారం, విగ్రహారాధన, మోసం, అన్యాయం, మద్యపానం, పొగ త్రాగడం, నోరు తెలిస్తే బూతులు మాట్లాడటం, అడ్డ దారులలో అన్యాయముగా సంపాదించుడం, మాట్లాడితే కోప పడటం, అసూయ, ద్వేషం ఇలా ఏదైనా కావచ్చు. దానిని ఈ క్షణమే విడిచిపెట్టి ప్రభువైన యేసు క్రీస్తును (అయన ఆజ్ఞలను) వెంబడించు, అంతే కాని పాపాన్ని పెంచకు.
ఒకవేళ ఇప్పటికే మీరు పాప బంధకములలో చిక్కుబడి ఉన్నారా? ఒకప్పుడు తెలిసి తెలియక పాపాన్ని పెంచి ఇప్పుడు ఆ పాపాన్ని విడిపించుకోలేక, శాంతి సమాధానం లేక, వేధనకరమైన జీవితం జీవిస్తున్నారా?
అయితే మోకరించి ప్రార్థించు, ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించు (మార్కు 9:29)
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు (యోవేలు 2:12)
దేవుడు మిమ్ములను పాపం నుండి విడిపిస్తాడు, మరలా పాపం జోలికి వెళ్ళకుండా అయన కొరకు సాక్షిగా జీవించండి.
యేసులో ఆనందం శాశ్వతమైనది, ఈ లోక (పాపపు) ఆనందం కేవలం తాత్కాలికమైంది అని గుర్తుంచుకోండి.