నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12
*దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడని.
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. లేవీ 11:44
*యేసు ప్రభువు వారు లోకానికి సవాలు విసిరారు. నేను పరిశుద్ధుడను. కాదని ఎవరైనా రుజువు చెయ్యండని. ఆ సవాలును స్వీకరించేవారు లేకపోయారు.
నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను 8:46
*దేవుని దూతలు కూడా ఆయన పరిశుద్ధుడు అని స్తుతిగానములు ఆలపిస్తున్నారు.
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా 6:3
*కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవా! ఎప్పటికైనాసరే పరిశుద్ధతయే నీ "మందిరము"నకు అనుకూలమని.
యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము. కీర్తనలు 93:5
*మందిరము అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు.
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. 1 కొరింది 3:16,17
నీ దేహమే దేవుని మందిరం. నాకు డబ్బుంది త్రాగుతా! బలముంది తిరుగుతా! అంటే? కుదరదు. నీవు వ్యర్ధమైన క్రియలచే నీ శరీరాన్ని పాడు చేసుకుంటే, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆయనే పాడు చెయ్యాల్సివస్తే ఇక విడిపించేదెవరు?
గొర్రె పిల్లను బలవంతముగా బురదలోనికి త్రోసినా వెళ్ళడానికి ఎంత మాత్రమూ ఇష్ట పడదు. పంది పిల్లను బలవంతముగా బురదలోనుండి బయటకు లాగినా రావడానికి ఇష్టపడదు. వీటిలో మన జీవితాలు దేనిని పోలి వున్నాయో? మనలను మనమే పరిశీలన చేసుకుందాం!
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి 1 పేతురు 1:14
ఈ ప్రకారము మనమునూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసులకు మాదిరికరంగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్