అంశము : విశ్వాసంలో జీవించడం
2 కొరింథీ 5:7 : “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము”
అనేక సార్లు మనము దేనినైన చూడనిదే నమ్మలేము, ఎందుకంటే కళ్లతో చూచినప్పుడే బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. కాని చూడకుండా విశ్వసించడం ప్రత్యేకమైనది.
ఈ ప్రపంచంలో అనేకులు అనేక ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతూ ఉంటారు, చారిత్రాత్మక, ఆధ్యాత్మిక సత్యాలను ఎన్నో పరిశోధనలు చేసి వాటిని ఎలాగైనా రుజువు చేయాలి అని ప్రయత్నించి, అది సఫలమయ్యాక నమ్మడం మొదలుపెడతారు. కాని క్రైస్తవులైన మనము దేవుని యొక్క గొప్ప పిలుపుతో పిలువబడి వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడచుకుంటాము.
హెబ్రీ 11 ప్రకారం ఒక ప్రత్యేకమైన విశ్వాసుల పట్టికను చూడగలం, ఈ గ్రంథకర్త అపో. పౌలు అనాది కాలం నుండి ఉన్న కొందరి విశ్వాస జీవితాన్ని మనకు బోధిస్తూ, వారు దేవుని యెడల ఎటువంటి జీవితాన్ని కలిగి యున్నారో గమనించగలం. వారు విశ్వాసములో జీవించి, విశ్వాసముతో దేవుని సేవించి, నిత్యత్వములో ఉన్న ఆ మహామహుని ఆరాధించి దేవుని గొప్ప వాగ్ధాన సంబంధమైన దీవెనలను పొందియున్నారు. విశ్వాసము ద్వారా దేవుని కొరకు గొప్ప కార్యములను చేసి, విశ్వాసముతో ఎన్ని శ్రమలైనా ఎదుర్కొని, నిత్య జీవమునకు కారకుడైన దేవుని పై నమ్మకముతో శ్రద్ధతో వినయముతో దేవుని వాగ్దాన అనుభవాన్ని పొందినట్లు గమనించగలం. ఆనాటి కాలం నుండి ఉన్న మన దేవుడు ఆనాడు వారితో ఉండి, జగత్తు పునాది వేయబడక ముందే మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈనాడు మనతో కూడా ఉండి తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
మార్కు 4:35-41, “ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమర మున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి--బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించినిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను. అప్పుడాయన మీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడిఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.” ఈనాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మనందరినీ అడిగే ప్రశ్న ఇదే “మీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా?”. దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేస్తాడు అన్న విశ్వాసం మనకు ఉందా? అట్టి విశ్వాసం మీకు ఉంటే, ప్రార్ధనలో మెలకువతో దేవుని సన్నిధిలో మరింత ముందుకు కొనసాగుతూ ఈ సిద్ధపాటు దినములలో దేవుడు మిమ్మును బలపరచును గాక.
నేటి నుండి విశ్వాసంలో మార్పు: గుండె బరువు తో, బాధలో, కన్నీటిలో, నిరాశలో నిస్పృహతో జీవిస్తున్నావా? నాకు సహాయం చేసే వారే లేరు అని దిగులు తో ఉన్నావా? నీతో ఉండే వారే నిన్ను నమ్మలేక నిన్ను నిందల పాలు చేస్తున్నారని దిగులు పడుతున్నావా? భయపడకుము అని ప్రభువు సెలవిస్తున్నాడు. దిగులుపడకుము, జడియకుము నేను ఉన్నాను అని ఆ ప్రేమా స్వరూపి నీతో ఉన్నాడు. మన కంటి చూపుతో చూసే దూరం వరకు మనకు తెలుసు, మన జీవిత పరిధి చిన్నది, దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తూ, కొండలనైనా పెకలించ కలిగిన సామర్ధ్యం, ఎట్టి సమస్య నైనా సులువుగా పరిష్కరించ గలిగిన వాడు మన దేవుడొక్కడే. అట్టి విశ్వాసంతో ప్రార్థించు, ఎన్నో గొప్ప కార్యాలను నీ జీవితంలో చూడగలవు.