*యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.* మత్తయి 2:2
క్రీస్తునందు ప్రియ పాఠకులారా! మీకందరికి *క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు* తెలుపుతున్నాను. సహజముగా క్రైస్తవులలో చాలామంది ఈ విధముగా ప్రవర్తిస్తారు. ఏ విధముగానో తెలుసా! ఏ రోజు చర్చికి పోకపోయినా క్రిస్మస్ రోజున వెళ్తారు. ఆ రోజు పాస్టర్ గారు క్రిస్మస్ సందేశాన్ని వినిపిస్తుంటే క్రొత్త బట్టలు వేసుకున్న వారు చర్చిలో కూర్చుని దర్జాగా నిద్రపోతుంటారు. ఆ రోజు చర్చి అంతా నిండిపోతుంది. వినేవారికంటే విశ్రాంతి తీసుకునేవారు, మాట్లాడేవారు, వస్త్రాలు చూచుకొనేవారు ఎక్కువ.
చాలావరకు బైబిలులో లేనివి అంతేకాక అనేక అన్య కార్యక్రమాలు క్రిస్మస్ రోజున జరుగుతుంటాయి. కాన్ స్టంటైన్ అనే చక్రవర్తి తన పరిపాలనలో వారు దేవునిగా భావించే సూర్య జయంతిని క్రిస్మస్గా మార్చాడు. కారణం ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరించాలనే ఆశతో దీనిని అమలుపరిచాడు. వాక్యములో లేనివి ఎన్నో అనగా క్యాండిల్ లైటింగ్ సర్వీస్, క్యారల్స్, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత రూపములో వేషధారణ మొదలగునవి ఈ పండుగలో చూస్తాము. గ్రీటింగ్ కార్డ్స్, స్టార్స్, కలర్ పేపర్స్ మొదలగు వాటినన్నింటిని ప్రజలు తండోపతండాలుగా వచ్చి కొనుక్కొని పోతుంటారు. ఈ పండుగ చివరకు వ్యాపారపర్వదినముగా మారింది. మన దేశములో తక్కువ. అయితే పాశ్చాత్య దేశాలలో *డిసెంబర్ 25 నుండి జనవరి 1 వరకు* సెలవులు ప్రకటిస్తారు.
సంప్రదాయసిద్ధమైన ఈ పద్ధతులు విశ్వాసుల సహవాసాలలో వుండవు. బైబిలులో లేనివి ఎందుకు పాటించాలి అని వీటన్నింటిని ఆపేశారు. అయితే మిషన్ సంఘాలలో వీటిని బాగా పాటిస్తారు. ఏమీ లేకపోతే చాలా బోర్ గా వుంటుందని అనుకునేవారు చాలామందే.
60% క్రైస్తవులు ఆర్భాటము, అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. బైబిలులో లేనివి చేస్తుంటారు. 40% క్రైస్తవులు కేవలం ఆరాధనకే ప్రాముఖ్యతనిస్తారు.
క్రీస్తు పుట్టాడనటానికి ఆధారం క్రీస్తు శకం లేక ఇంగ్లీష్ కాలెండర్. దీని ఆధారముగానే 2018వ సంవత్సరము అని లెక్కవేయగలము. యేసు జననము క్రీ.పూ 4వ శతకములో అని కొందరు అంటారు. క్రీస్తు పుట్టి రమారమి 2018 సంవత్సరాలు అయింది. గొర్రెలకాపరులు చలికాలములో చలికాచుకొనుటచేత డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను నిర్ణయించారేమో. ఆసియాలోని రష్యాలో జనవరి 6వ తేదీ క్రిస్మస్ పండుగను ఆచరిస్తారు. దాని అర్థం క్రీస్తు రెండు సార్లు పుట్టాడా? కానేకాదు మొత్తానికి యేసు జన్మించాడు అన్నది వాస్తవము.
యేసు జననం పేరుతో డబ్బులు వృథా చేస్తున్నారే తప్ప కృతజ్ఞతాభావముతో ప్రభువును ఆరాధించడంలేదు. అయితే సంవత్సరమంతా కృతజ్ఞతాభావముతో ఆరాధిస్తే చాలు.
యేసు ఈ లోకంలో జన్మించడం చారిత్రాత్మకం. దేవుని కుమారుడుగా, రాజుగా ఆయన పుట్టాడు. పుట్టగానే రాజైనటువంటి ఒకే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువులవారు.
జపాన్ దేశమును పరిపాలిస్తున్న రాజు పేరు హిరోహితో. ఎక్కువ కాలం ఇతడే ఈ దేశమును పాలించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. రాజ వ్యవస్థ ప్రకారం పెద్ద కుమారునికి రాచరికం దక్కాలి. అయితే హిరోహితో పెద్దకుమారునికి చాలాకాలం సంతానము కలుగలేదు. యువరాజుకు పిల్లలు పుట్టలేదని జపాన్ దేశమంతా నిరాశతో వున్నప్పు డు షింటో మతంవారు రకరకాల పూజలు చేశారు కాని ఫలితము శూన్యం. ఒక రోజు ఆకస్మికముగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఏమనగా రాజు యొక్క పెద్దకోడలు గర్భము ధరించింది. ఆ వార్త విన్న ప్రజలందరు దేశమంతా సంబరాలు చేసుకున్నారు. తొమ్మిది నెలల గర్భము మోసిన ఈమెకు పుట్టబోయేది కుమారుడే అని ఊహించినవారి ఆశలు బెడిసికొట్టాయి ఎందుకనగా పుట్టింది కుమార్తె.
జపాన్ సింహాసనముమీద అమ్మాయిని కూర్చోబెట్టడానికి వీలులేదు. కాబట్టి రాజ్యాంగమును సవరించి అమ్మాయిని యువరాణిగా చేయాలనుకున్నారు. దీనికే ఇంత హంగు ఆర్భాటాలు జరిగితే సర్వసృష్టిని సృజించిన ఆదిసంభూతుడైన దేవునికి ఏ ఆర్భాటము లేదు, ఏ బ్రేకింగ్ న్యూస్ లేదు. యేసు పుట్టాడని లోకానికి తెలిపింది దేవదూతలు ద్వారా వినిన విద్యలేని గొర్రెలకాపరులు. యెరూషలేము నుండి 7కిలోమీటర్లు దూరములో వుండే బెత్లెహేము అను పట్టణములో యేసు జన్మించాడు. బాలుడైన యేసును దేవాలయమునకు తీసుకొని వెళ్ళగా సుమోయోను మరియు అన్న ప్రవక్తిని సహితము యేసుని శ్లాఘించారు. అక్కడక్కడ యేసును స్తుతించినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఎక్కువ శాతం యూదులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
యేసు పుట్టగానే మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగును ఎక్కడో తూర్పు దేశములో జ్ఞానులు నక్షత్రము ద్వారా చూడగలిగారు. యేసు విషయమై తరచి చూస్తున్న జ్ఞానులు నక్షత్రమును చూచి నిర్ధారణ చేసుకున్నారు ఈ జ్ఞానులను ఇంగ్లీషులో Magi అని పిలుస్తారు. వీరిని మాంత్రికులు లేక గారడీవారు అనికూడా పిలుస్తారు. అంతేకాక ఈ జ్ఞానులు ఎప్పుడు ఖగోళ శాస్త్రమును అధ్యయనం చేస్తుంటారు. ఈ జ్ఞానులు తమ ఖగోళ జ్ఞానము ద్వారా లోకరక్షకుని కనుగొన్నారు. ఒక రాత్రి ఆకాశములోని నక్షత్రాలను చూడండి. వాటిని మనం ఎంచలేము. అక్కడక్కడే నక్షత్రాలు వాటి స్థానాలు మారుతుంటాయి. ఈనాడు దేశములో ఎక్కువ ప్రాధాన్యతలో వుండేది జ్యోతిష్య శాస్త్రము. దీనికి కూడా డిగ్రీలు ఇస్తారు. చాలా మంది క్రైస్తవులు ఒక వైపు దేవుని ఆశ్రయిస్తారు. మరొక వైపు జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఎంత బాధాకరం! ఇలాంటి వారి దగ్గరికి మనం పోకూడదు. రాశిబలం, నక్షత్రబలం చూడడం ఇవన్నికూడా దేవుని బిడ్డలకు సంబంధించినవి కావు.
కొన్నిసార్లు అన్యులతో వారి పద్ధతులలోనే దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ ఆయన ఎలాగు రక్షించబడ్డాడు? దేవుడు కనబడితే బ్రతకాలి లేకపోతే చావాలి అని నిర్ణయించుకుని తన దేవుళ్ళకందరికీ ప్రార్థించగా ఎవరు జవాబివ్వలేదుకాని, దేవుడు అలాంటి వ్యక్తితో తన తెలుగు ద్వారా మాట్లాడాడు. సిక్కులలో కల్సా నియమము పాటించేవారు చాలా నిష్టగా వుంటారు. అలాంటివారిని మనం మార్చలేము. వారిని మార్చేది దేవుడే.
జ్ఞానులు అన్యులే వారికి తెలిసింది ఒక్కటే నక్షత్రము. *మత్తయి 2:1,2* ప్రకారం వారెవరిని వెదకుచున్నారు? రక్షకుని మెస్సీయ్యాను వెదకుచున్నారు. నేటి దినాలలో చాలామంది జ్ఞానం కొరకు, లోకం కొరకు ఎంతో ఖర్చు పెడతారు. పరిశోధన తర్వాత పరిశోధన చేస్తుంటారు. నిజమైన జ్ఞాని రక్షకుని వెదికేవాడిగా ఉంటాడు. ఈ జ్ఞానులు 500మైళ్ళ నుండి 1000మైళ్ళ వరకు ప్రయాణం చేశారు. ఆ రోజులలో రహదారులు లేవు. దాదాపు ఒక సంవత్సరము ఒంటెలమీద ప్రయాణం చేస్తూ వచ్చి ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసును కనుగొన్నారు మరి ఈనాడు నీవు యేసుని వెదకుచున్నావా? పాపివైన నిన్ను ప్రేమించి, నశించిపోతున్న నిన్ను ఆయన వెదకుతూ వస్తున్నాడు. *లూకా 19:10*
భక్తుడైన యెషయా ద్వారా *”నన్ను మెదకనివారికి నేను దొరికితిని”* అని ప్రభువు సెలవిచ్చారు *యెషయా 65:1*. ప్రభువు దొరికేది దేవుని మెదకనివారికే క్రిస్మస్ను ఆచరించేవారినుండి ప్రభువు ప్రక్కకు వెళ్లిపోతున్నాడు. చిన్న ఉదాహరణ ఒక గ్రామం నుండి నగరానికి వచ్చిన ఒక వ్యక్తి క్రిస్మస్ రోజున చర్చికి హాజరవుతామని ఎక్కడికి వెళ్ళిన అతనికి స్థలము దొరకలేదు. నిరాశతో, నిస్పృహతో తిరిగిపోతుంటే ఒక వ్యక్తి ఎదురు వచ్చాడు. ఆయన ఈ గ్రామస్థుని అడిగాడు ఏంటి నీ సమస్య? అని. ఆ గ్రామస్థుడు *”నాకు చర్చిలో స్థలము దొరకలేదు”* అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ప్రతిస్పందన ఏమిటో తెలుసా! నాకే స్థలములేదు ఇంక నీకెక్కడ దొరుకుతుంది అన్నాడు. అలా అన్న వ్యక్తి ఎవరోకాదు యేసుక్రీస్తు ప్రభువే. అవును ఈనాడు ప్రభువులవారికి సంఘములలో చోటులేదు. ఈ ఉపమానం మనకు అతిశయోక్తిగా కనబడవచ్చుగాని వెదికే వారికి మాత్రమే ఆయన దొరుకుతాడు.
*కీర్తన 14:2వ* వచనములో దేవుడు ఆకాశమును చూచి వివేకము కలిగి తన్ను వెతుకువారు కలరేమో అని నరులను పరిశీలన చేశాడు. బహుశా మనలను కూడా క్రిస్మస్ ముందురోజు చూడవచ్చేమో. మరి వారేమయ్యారు? చెడియున్నారు, దారితొలగియున్నారు. ఎంత బాధాకరం. క్రిస్మస్ రోజున కూడా చర్చికి పోనివారున్నారు. కొందరు బార్ల దగ్గర మందు కొరకు తచ్చాడుతుంటారు. ఆరోగ్యాన్ని పాడుచేసే మందు కొరకు డబ్బులు వృధాచేసి యేసు పుట్టాడని త్రాగుచున్నారు. నేను పుట్టిన దినమందు మీరు మధ్యం సేవించండి అని ఎక్కడ చెప్పలేదు. విపరీతముగా తినండి అని కూడా చెప్పలేదు. క్రిస్మస్ రోజున విదేశాలలో ఎన్నో ఆక్సిడెంట్స్ జరుగుతాయి దానికి కారణం త్రాగి నడపడమే.
ప్రియ చదువరి! నీవు వెదకవలసినది క్రీస్తును మాత్రమే. అన్యులైన జ్ఞానులు ఏ విధముగా క్రీస్తును వెదకి వచ్చారో అలాగే నీవు కూడా వెదకి వచ్చి ఆయన దగ్గర నీ పాపములను ఒప్పుకొని యేసు రక్తములో కడుగుకొని నీతిమంతుడుగా తీర్చబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడి జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుడు మిమ్మును దీవించును గాక!