నిజమైన క్రిస్మస్ ఎప్పుడు?


  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

*నిజమైన క్రిస్మస్ ఎప్పుడు ?*

ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీ 9:26-28*

క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకందరికి క్రిస్మస్ శుభములు తెలుపుచున్నాను.  ఈ పర్వదినాన క్రిస్మస్ గురించి మీరేమనుకుంటున్నారు? గత దినాలలో క్రిస్మస్ పండుగ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అని కొన్ని మీడియా సంస్థలు ప్రజలను ఇంటర్వ్యూ చేయగా ప్రజల స్పందన ఈ విధముగా ఉంది.  క్రిస్మస్ అంటే – Tree అని, Star అని, Colour Bulbs అని, New Clothes అని, Candles అని, Church Attending అని, Good Meals అని, Cake అని ఇలా అనేకమంది క్రిస్మస్ అనగా అర్థం పర్థంలేని జవాబులిచ్చారు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించి, మహిమపరిచి, ఘనపరచుటయైయున్నది. ప్రకటన 4:8   సందేశంలోని వాక్యభాగమును జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక్కసారే ప్రత్యక్షపరచబడెనని 26వ వచనము చివరి భాగంలో చూస్తాము. దీనిని క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతగా మరి విపులముగా ధ్యానిస్తాము.

మొదటి ప్రత్యక్షత :

ఈ ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువులవారిని తండ్రియైన దేవుడు ఈ లోకానికి బహుమానముగా ఇచ్చెను అని యోహాను 3:16లో చూస్తాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అనగా ఆయన లోకములో వుండే మనలనందరినీ ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా అనగా అనేక కుమారులు వుండికాక ఒకేఒక అనగా తన ఏకైక కుమారుని మన కొరకు మరియు ఈ లోకమును రక్షించుటకు మనకు అరుదైన బహుమానముగా ఎవరుకూడా జీవితములో ఇవ్వలేనటువంటి బహుమానమునిచ్చెను. కనుక మనకందరికి దేవుడిచ్చిన అద్భుత వరం. అంతేకాక గొప్పతనములోను, విలువలోను వర్ణనాతీతమైన ఉచిత వరం అని తెలుసుకోవాలి. 2కోరింథీ 9:15లో శక్యముకాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు అని పౌలు అన్నాడు. యేసు ప్రభువును లోకానికి పంపడములో దేవుని ఉద్దేశ్యము ఇక్కడ స్పష్టముగా వెల్లడయింది. మనుష్యులు పాపములో నశియించిపోవుచున్నారు. వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక. మనము శాశ్వతముగా నరకములో నశించిపోవడం దేవునికి ఇష్టములేక తనతో అనంతకాలం జీవించడానికి దేవుడు మనకిచ్చిన అవధులులేని, పరిమితిలేని, కానుక. ఈ మొదటి ప్రత్యక్షత వలన మనము దేవుని స్తుతించి, ఆరాధించి, ఘనపరచాలి.

ప్రత్యక్షత మర్మము :

యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షతమవ్వడానికి మూలకారణం లోకమంతటిని రక్షించి తన బిడ్డలనుగా చేసుకోవాలన్నది తన ప్రణాళికయైయున్నది. అందుకే ఆయన పరిశుద్ధాత్మవల్ల జన్మించి నరావతారుడై ముప్పదిమూడున్నర సంవత్సరములు జీవించి ఈ లోకము కొరకు తానే తన ప్రాణమును బలిగా యిచ్చెను. ఒక వ్యక్తి ప్రజల కొరకు ప్రాణము పెట్టడం ఎప్పుడైనా చూశామా? ఎవరైనా ప్రాణము పెడితే తమ కొరకో, తమవారి కొరకో ప్రాణము పెట్టడం సహజం. కానీ ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం చూడలేము. కానీ మన ప్రభువు పాపమానవాళి కొరకు ప్రాణం పెట్టడం చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం. ఈ విషయాన్ని గురించి యోహాను 10:18లో చూస్తాము.

మరణము, జీవము ఆయన చేతిలో వున్నాయి అని పై వాక్యభాగములో చూస్తాము. కావున తనంతటతానే తన ప్రాణమును మనకొరకు ఇచ్చెను. ఎంత ధన్యకరము!  ప్రియులారా! ఇలాంటి ధన్యకరమైన జీవితం మనం పొందుట ఎంత ఆశీర్వాదకరం. అనగా తన ప్రాణమును ఇతరుల కొరకు ఇచ్చి అందరిలో అతిశ్రేష్ఠుడైన యేసుప్రభువును మనం దేవుడిగా కలిగియుండడం మనకెంతో దీవెన. అలాంటి దేవున్ని నిత్యము నీవు స్మరిస్తూ నీ జీవితంలో నీ ప్రతిభారమును ఆయన మీద మోపగలిగినట్లయితే ఆయన నిన్ను విడిపించి రక్షించి కాపాడువాడు.

యేసుక్రీస్తు నరావతారిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అని ఫిలిప్పీ 2:7లో చూస్తాము. కనుకనే ఆయన అందరిలో తనను తాను తగ్గించుకొనినవారిలో క్రీస్తు ప్రథముడైయున్నాడు. అందుకే పౌలు యేసు ప్రథమ ఫలము అని వర్ణించాడు. అంతేకాక ఆయన మనకొరకు మధ్యవర్తిగా వుండి విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు ఆయన మనకు సమాధాన పరిచర్యను అప్పగించెను. మన పాపములను మనము మోయకుండనే ఆయనే మోసి మనకు సమాధానమునిచ్చెను. ఈ సమాధానమే ఒక గొప్ప సువార్త అని  పౌలు వర్ణించాడు.   పైన పేర్కొనబడిన విషయాలన్నీయుకూడా క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతను జ్ఞాపకము చేయుచున్నవి. ఆయన బిడ్డలైనవారందరు ఈ గొప్ప ప్రత్యక్షతను అనుభవించిరి. ఈ ప్రత్యక్షత నీవు అనుభవించినచో ధన్యుడవే. క్రీస్తు మొదటి ప్రత్యక్షత నీకు లేనట్లయితే నీవు ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుని ఆయన రక్తముచేత కడుగబడి నీతిమంతుడిగా తీర్చబడితే నీవు కూడా మొదటి ప్రత్యక్షత అనుభవించినవాడవు. ఎవరైతే మొదటి ప్రత్యక్షత అనే అనుభవమును కలిగియుంటారో వారికే రెండవ ప్రత్యక్షత దొరకును.

రెండవ ప్రత్యక్షత :

క్రీస్తు రెండవ సారి ప్రత్యక్షమగునని హెబ్రీ 9:28వ వచనములో చూడగలము. ఎవరైతే ఆయనను నమ్మి ఆయన బిడ్డలుగా జీవించుదురో వారికి ఈ ప్రత్యక్షత రాబోవు కాలమందు దొరకును. ఈ లోకములో మనుష్యులందరు మరణమునొందుదురని పౌలు హెబ్రీ పత్రిక 9:27లో జ్ఞాపకము చేస్తున్నాడు. గనుక మరణము అందరికీ తథ్యమని చెపుతున్నాడు, కావున మరణము తరువాత ఏమిజరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ విషయమును లోకములో ఎవ్వరూ తెలుసుకొనలేక పోతున్నారు. అయితే ఈ విషయమును గూర్చి మనము వాక్యముద్వారా తెలుసుకుందాం. మరణము తరువాత ఏమని ఆలోచించేవారంతా ఒకవిషయంలో జాగ్రత్తగా గమనించాలి. మరణము తర్వాత తీర్పు ఉన్నదని మనము చూస్తాము. తీర్పులో నిర్దోషిగా వుండే వారందరికి తదుపరి గమ్యస్థానం పరలోకమే. ఈ ధన్యత భూమిమీద జీవించువారందరికి అనగా ఆయననెరిగియున్న వారందరికి దేవుడిచ్చే గొప్ప బహుమానం. కావున ఆయన రక్తములో కడుగబడివుంటే ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో వుంటావు. ఈ ధన్యత పొందవలసినది నీవు, నీ కుటుంబము, నీ సంఘమే. తద్వారా మహిమ, ఘనత, మెప్పును దేవుని ద్వారా పొందగలవు. ఇదే రెండవ ప్రత్యక్షత.ఎవరైతే ఈ రెండవ ప్రత్యక్షతకు యోగ్యులుగా వుందురో వారిదే నిజమైన క్రిస్మస్. కనుక ఈ ప్రత్యక్షత కొరకు నీవు సిద్ధపడియున్నావా? లేక ఇంకా ఈ లోకమును ప్రేమించుచున్నావా? మన జీవితములను పరీక్షించుకొని మారుమనస్సుపొంది పశ్చాత్తాపపడి ఆయన కొరకు జీవించుచు, మన దృష్టిని లోకమువైపు మరల్చకుండా ఆయన వైపే గురి కలిగి వుండినచో నీవు ఆశీర్వదించబడుదువు.

నీవు క్రిస్మస్ పండుగ ఆచరణలో మునిగి, త్రాగి, భుజించి, కేరింతలు వేస్తూ గడుపుతున్నట్లయితే నీవు ఒక సారి జాగ్రత్తగా ఆలోచించు. క్రిస్మస్ అంటే కేకలు కాదు, అరుపులు కాదు, ఆర్భాటాలు కాదు. క్రిస్మస్ అనగా సమాధానము మీకు కలుగునుగాక అని దూతలు పలికినట్లు మనం కూడా సంఘములో తోటి విశ్వాసులతో క్రిస్మస్ దినాన నీకు సమాధానము కలుగునుగాక అని పలికితే అంతకంటే సంతోషము మరొకటి లేదు. కావున మనం సంతోషకరమైన క్రిస్మస్ జరపాలంటే

1) క్రీస్తు మొదటి ప్రత్యక్షతను పొంది రెండవ ప్రత్యక్షతకు సిద్ధపడాలి.

2) అందరితో సమాధానముగా వుంటే అదే అసలైన సిసలైన క్రిస్మస్ పండుగ.

కావున దేవుడు కోరే అసలైన క్రిస్మస్ అనే రెండవ రాకడకు నీవు నీ కుటుంబము సిద్దపడియుండాలి. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్!