ప్రవచనాత్మకమైన ప్రకటన గ్రంథము బైబిలు గ్రంథములోనే చిట్టచివరి పుస్తకము.
ఈ పుస్తకంలో 22 అధ్యాయాలు, 404 వచనాలు కలవు. ఈ గ్రంథమంతా ప్రవచనములతో నింపబడియున్నది. ఈ పుస్తకాన్ని వ్రాసినది యోహాను భక్తుడు. తాను వ్రాసిన ఈ పుస్తకము మొదట ఏడు సంఘములకు ఇవ్వబడెను. ఆ తదుపరి ఆ ప్రతులు రోమా ప్రభుత్వము చేతిలోనికి వెళ్ళినవి, అవి వారికి అర్థము కాలేదు. ఆ తర్వాత అవి యోహాను శిష్యుల చేతికి దొరికినవి. వారి ద్వారా ఆ ప్రతులు ఏడు సంఘములకు చేరినవి. ఈ గ్రంథము వెనుక వుండి యోహానును బలపరచి దూతల ద్వారా సందేశమును పంపించినది పరిశుద్ధాత్మ దేవుడే.
పరిశుద్ధాత్మ దేవుడు మూడు రకాల ప్రతులను యోహానుకు యిచ్చాడు. అంతేకాక ప్రకటనలోని అనేక వాక్యభాగాలు పాతనిబంధన గ్రంథములో దానియేలు గ్రంథము 7 నుండి 12 అధ్యాయాలు, యెషయా 24 నుండి 27 అధ్యాయాలు, యెహెజ్కేలు 37 నుండి 41 అధ్యాయాలు, జకర్యా 9 నుండి 12 అధ్యాయాలలో చూస్తాము.
ప్రకటన గ్రంథము తిరగబడిన పుస్తకము అని చెప్పవచ్చు. ఈ పుస్తకము పరలోకములోని క్రీస్తును మహిమపరిచేది, అంతేకాక సంఘము కొరకు తన ప్రణాళికను బయలుపరిచేది. ప్రకటన గ్రంథములోని అనేక విషయాలను దేవుడు ముందుగానే దానియేలుకు బయలుపరచెను. అయితే దేవుడు దానియేలు వ్రాసిన ప్రతులకు ముద్రవేయమన్నాడు. ఈ విషయాన్ని దానియేలు 12:4లో చూస్తాము. ఆదిమ కాలములో రెండు రకముల ప్రతులు ఉండేవి. ఒకటి ముద్రవేయబడినవి, రెండవది ముద్రలేనివి. దానియేలు వ్రాసినవి తను సంపూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు అని మత్తయి 24:15లో, దానియేలు 12:8 లో చూడగలుగుతాము.
దర్శనం ద్వారా యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము వ్రాసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథమును ముద్రవేయవలదు అన్నాడు. గనుక ఇది తెరువబడిన పుస్తకం అని మనము గ్రహించాలి. ప్రకటన 22:10లో ఇలా వ్రాయబడివుంది. “మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను – ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది”.
ప్రకటన గ్రంథము మనము అర్ధము చేసుకోవడానికి తప్పనిసరిగా దానియేలు గ్రంథమును మనమందరము చదవాలి. దానియేలు గ్రంథములోని డెబ్బైయొక్క వాక్యభాగాలు క్రొత్తనిబంధనలో 16 పుస్తకాలలో మనము చూస్తాము. ఎక్కువగా ప్రకటన గ్రంథములోను చూస్తాము. *ఉదాహరణకు :* దానియేలు గ్రంధములోని 6వ అధ్యాయములోని వాక్యభాగము హెబ్రీ పత్రిక 11:33లో చూస్తాము.
మొత్తము మీద పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో చెప్పిన ఈ మాటలను గమనిస్తే ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు అనే చూస్తాము. ఈ వాక్యభాగము ప్రకటన 1:3లో వ్రాయబడివుంది.
విశ్వాసులుగా ప్రతి వ్యక్తి బైబిల్ గ్రంథంలోని పుస్తకాలన్ని చదివినా, చిట్టచివరి పుస్తకమైన ప్రకటన గ్రంథమును తప్పనిసరిగా చదవాలని పరిశుద్ధాత్ముడు పదే పదే జ్ఞాపకము చేయుచున్నాడు.
ఇంకా లోతుగా ఆలోచిస్తే ప్రస్తుతము క్రైస్తవ సంఘములలో ఆదివారము ఆరాధనలో ఉత్తరప్రత్యుత్తరముగా కీర్తన గ్రంథములోని వాక్యభాగాలను ఎక్కువగా చదివిస్తారు. అయితే యోహాను కాలములోని ఏడు సంఘములలో ప్రకటన గ్రంథములోని వాక్యభాగాలనే ఎక్కువగా చదివేవారు. అంతేకాని మిగతా వాక్యభాగాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువరు. నేటి ప్రస్తుత సంఘములలో కూడా కీర్తనలు గ్రంథమునకు బదులుగా ప్రకటన గ్రంథములోని వాక్యభాగాలను చదివిస్తే వారంతా ఆశీర్వదించబడేవారే. ఎంతగొప్ప ధన్యత! ఈ ధన్యత నీకుందా?
కావున ప్రకటన గ్రంథములోని ప్రవచన వాక్యభాగములను మనం అనుదిన కూడికలలో, మందిర ఆరాధనలో వ్యక్తిగతంగా చదువుట ఎంతో ఆవశ్యకం.