ఆయన తండ్రిలేనివారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. ద్వితీయోపదేశకాండము 10:18
ప్రభువునందు ప్రియమైన పాఠకులకు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు నామమున శుభములు.
ఈ లోకములో భూమి మీద జీవించే మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారిలో అనేకమంది పేదవారు, ధనికులు, ఉన్నవారు, లేనివారు వున్నారు. వీరందరిలో అత్యంత ఘోరమైన శ్రమలు అనుభవించి తమ బాధను ఎవరితోను పంచుకోలేక కృశించిపోయి, నీరసించిపోయి, కుమిలిపోయి, ఆదరణ కరువైనవారు ఎవరనగా వారే విధవరాండ్రు. విధవరాండ్రనగా భర్తను కోల్పోయిన స్త్రీ అనగా భర్త మరణానంతరం ఒంటరితనమును అనుభవించి పిల్లలను పోషించలేక తనను కాపాడుకోలేక నిరాశ్రయులుగా కనిపించువారు. వారిలో సంతోషం, ఆనందం మచ్చుకైనా కనబడదు.
లోకములో కోట్లమంది విధవరాండ్రున్నారు. వారందరిని కాపాడి సంరక్షించేదెవరు? రక్తసంబంధికులు సహితం, స్నేహితులు సహితం విడిచిపెట్టినా విడువనివాడు, ప్రేమించువాడు, కనికరించువాడు, ఓదార్చువాడు, ఆదరించువాడు యేసుక్రీస్తు ప్రభువు.
పై వాక్యభాగంలో విధవరాండ్లపట్ల దేవుడు చూపే కనికరం, జాలి ఎలాంటివో చూడగలము. భక్తుడైన మోషేతో దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ విధవరాలి గురించి ప్రత్యేకముగా ప్రస్తావించి, విధవరాలికి దేవుడు చేసేదేమిటో విశదపరిచాడు. వాటిని మనము కూడా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు.
విధవరాలికి దేవుడి చేసే కార్యములు :-
దేవుడు మనందరి పక్షానవున్న దేవుడే అని పౌలు రోమా పత్రికలో వ్రాస్తూ 6:31లో తెలియజేశాడు. అయితే దేవుడు ఎక్కువగా విధవరాలి పక్షాన వుంటాడని అనేక వాక్యభాగాలలో చూస్తాం. అంతేకాక పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని అనేకమారులు ప్రస్తావించాడు.
దేవుడు విధవరాలి పక్షమున పోరాడే దేవుడు :
ద్వితీయోపదేశకాండము 10:18వ లో చెప్పబడిన వాక్యము రూతు నయోమి జీవితములో నెరవేర్చబడింది. దేవుడు నాకు విరోధముగా సాక్ష్యము పలికెను అని చెప్పినప్పటికిని దేవుడు వారి పక్షమున వున్నాడు. ఎట్లనగా బెత్లెహేము పట్టణమునకు కరువు వచ్చినప్పుడు కరువుకు భయపడి నయోమి కుటుంబము మోయాబుకు వెళ్లిన తరువాత విషాదఛాయలు అలుముకున్నాయి. భర్తను కోల్పోయింది ఆ తదుపరి కుమారులను కోల్పోయింది. కనుక ఒకే ఇంటిలో ముగ్గురు విధవరాండ్రు. ఎంత బాధాకరం. ఓర్పా తన స్వంత ఇంటికి వెళ్ళినా నయోమి రూతులను క్లిష్ట పరిస్థితుల్లో ఆదరించింది దేవుడే. వారి పక్షాన ఉన్నాడు. అందుకే బోయజు రూతుతో ఇలా అన్నాడు. రూతు 2:12వ లో చూస్తాము. నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చితివి అన్నాడు. కాబట్టి విధవరాండ్రెల్లప్పుడు దేవుని రెక్కల క్రింద సురక్షితముగా జీవిస్తారు. శత్రువులేమి చేయలేరు.
విధవరాలికి దేవుడు చేసే మేలులు లేక ఆశ్చర్యకార్యాలు : 2 రాజులు 4:1-7
ప్రవక్తయైన ఎలీషా ప్రారంభించిన పరిచర్యలో రెండవ అద్భుత కార్యము ఒక విధవరాలి గృహములో జరిగింది. ఎలీషా ఆ ఇంటికి రాకముందు భర్తను కోల్పోయింది. ఒక ప్రక్క విధవరాలిగా మరియొక ప్రక్క అప్పుల సమస్యతో రెండింటి మధ్య సతమతమైంది. ఇలాంటి పరిస్థితులలో ఎలీషా ఆ స్త్రీని దర్శించడం ఆమెకెంతో ధైర్యాన్ని నిబ్బరాన్ని ఇచ్చింది. విధవరాలి ఇంటికి దైవసేవకులు వస్తే అలాంటివారిని ఎంతగానో ఆదరిస్తారు. అంతేకాక వారు ఆశీర్వాదాలు కూడా పొందుతారు.
ప్రవక్తయైన ఎలీషా ఇంటికి రాగానే బోరున విలపించి నా భర్త చనిపోయాడు అని చెప్పి ఆవేదనలో మరొక సమస్యను అనగా అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకునిపోవుటకు వచ్చియున్నారని మొఱ్ఱపెట్టగా, ఎలిషా ఆ సమస్యను సునాయసముగా పరిష్కరించాడు.”నా వలన నీకేమి కావలెను”* అన్నమాట ఈ స్త్రీని ఎంతగానో ఆదరించెను.
ప్రియా సహోదరీ! ఒకవేళ నీవు విధవరాలివైయున్నట్లయితే దేవుడు నిన్ను అడిగేది *నీకేమీ కావలెను* కావున ధైర్యమును కోల్పోవద్దు నిరాశ చెందవద్దు.
ఎలీషా చేసిన అద్భుతము మనము గమనిస్తే అప్పుల ఊబిలో కూరుకునిపోయిన ఆ స్త్రీకి అప్పులు తీర్చే ఆశ్చర్యకరమైన అద్భుతం ఎలిషా ద్వారా దేవుడు జరిగించాడు. ఉన్న కొద్ది నూనెతో ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వాదించినట్లు విస్తారమైన నూనెగా అనేక పాత్రలలో అనగా తన పాత్ర కాకుండా బయటనుండి పాత్రలు తెచ్చుకుని వాటినిండా నూనె నిండిపోవునంతగా దీవించెను. అప్పులు తీర్చింది దేవుడు పాత్రగా వాడబడింది ఎలిషా.
*దేవుడు విధవరాలి పక్షాన న్యాయము తీర్చు దేవుడు అనుటకు నిదర్శనం.*
ప్రియమైన దేవుని బిడ్డ! నీవు కృంగిపోవలసిన అవసరములేదు. నిరాశ చెందవలసిన అవసరములేదు. ప్రభువు మనతో నుండగా మనకు విరోధి ఎవడు? ఆయనే నీ పక్షమున ఉండి వ్యాజ్యమాడు దేవుడు. దేవుడు నిన్ను విడువను ఎడబాయనని ఆయనయే చెప్పెను గదా.
ఈ సందేశము చదువుతున్న మీరెవరైనా సరే మీకు ఎంతోమంది భర్తను కోల్పోయిన విధవరాండ్రు ఎదురవుతుంటారు. అలాంటివారిని ఆదరించి పరామర్శించి వారికి అవసరమైన సహాయాన్ని చేయాలి. దేవుడు కోరే, మెచ్చే అద్భుతమైన పవిత్రమైన భక్తి ఇదే అని భక్తుడైన యాకోబు 1:27లో వివరిస్తాడు. కనుక ఈ వాక్యానికి లోబడి విధవరాండ్రను ప్రేమించి ఆదరించి, ధైర్యపరచి దేవుని దృష్టిలో మనము మెప్పును, ఘనతను, ఆశీర్వాదమును పొందుదుము గాక.