మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును. ద్వితీయోపదేశకాండము (11: 11-12).
ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం. కొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరచుకొనేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలుగబోయే కొత్త అనుభవాలు, జరుగనున్న మార్పులు, కొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరూహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. "అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును." మన అవసరాలన్ని దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్లు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానము, ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది.
మనం అడుగుపెట్టబోతున్న దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. అంతా చదునుగా ఉండదు. అంతా పల్లంగానూ ఉండదు. జీవితం చదునుగా, ఎత్తుపల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు, లోయలు ఉండాలి. కొండలు వర్షాధారల్ని పోగుచేసి లోయల్లోకి ప్రవహింప చేస్తాయి. మన జీవితాల్లోను ఇంతే .కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షాధారాల్ని పొందుతాము. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సణుగుకుంటాము. కాని ఈ పర్వతాలలే వర్షాలు కురవడానికి కారణం.
అరణ్యంలో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో? అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్లంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేల మట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో! కానీ దృఢమైన, తలవంచని, అజేయమైన కొండ ప్రదేశాలలో శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండచరియల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణం అయి దేవుని దగ్గరగా మనం వెళ్లగలుగుతున్నాము. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. "కేవలం నమ్మకం ఉంచు". ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకొని ముందుకి నడిపిస్తాడు. అది మంచి సంవత్సరం. దీవెనకరమైన కొత్త సంవత్సరం.