ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను (2కొరింథీ 7:5)
ఇలా మన మీద అంత కఠినంగానూ, తెరపి లేకుండాను వత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు? ఎందుకంటే, మొదటిగా ఆయనకున్న శక్తి, మనపైనున్న కృప వెల్లడి కావడానికే. ఇలాంటి వత్తిడులు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాదు. అయితే ఆయన శక్తిలోని మహాత్మ్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు.
మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది. దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు. మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు.
యేసు ప్రభువు నిలిచిన చోటు ఇదే. ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు. మన సొంత శక్తితో కాదు. ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకుని ఆయన శక్తితోనే నిలబడాలి. ఒక్క అడుగైనా ఒంటరిగా వెయ్యడానికి సాహసించకూడదు. ఇది మనకు నమ్మికను బోధిస్తుంది.
శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవరచుకునేందుకు వేరే మార్గం లేదు. శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు. జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకి మంచిది.
ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి, కలకాలం నిలిచివుండే పెన్నిధి. నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే.
ఇతరులు పాడుతుంటే నేనెందుకేడవాలి?
శ్రమల లోతును కొలిచి చూడడానికి
ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు పనిచెయ్యాలి?
దేవుని ఆజ్ఞ మేరకు నా బలాన్ని వెచ్చించడానికి
ఇతరులకన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి?
పరాజయపు చేదును చవి చూడడానికి
అందమైనవన్నీ ఇతరులకు దక్కుతుంటే నాకీ జీవితం ఏమిటి?
నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి