Day 74 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి. కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను (యెషయా 41:14,15).

పురుగు, పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం - రెండింటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది. రాయి తగిలితే గాయపడుతుంది. నడిచేవాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురిపిడి మ్రానో, ఇది నలగొడుతుందేగాని తానెప్పుడూ నలుగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దాన్ని రెండోదిగా మార్చగలడు. పురుగు లాగా బలహీనంగా ఉన్న మనిషిని గాని జాతిని గాని తన ఆత్మ శక్తితో దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు.

కాబట్టి పురుగులాంటి వారు నిరుత్సాహ పడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ర్పేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మచీకటి లాటి నిరాశను నలగగొట్టి దాన్లో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కులాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు. చెయ్యకుండా ఉంటాడా?

ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుషులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళనీ, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతికొమ్మనూ ఆయన తిరిగి పచ్చగా కళకళలాడేలా చేస్తాడు. దుఃఖంతోను, శ్రమతోను చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారుచేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు.

నన్ననుసరించు నిన్ను సరిచేస్తాను
నామాటలు పలికిస్తాను
నా కరుణకు పాత్రుడిగా చేస్తాను
ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను

నన్ననుసరించు నిన్ను సరిచేస్తాను
నీవు సాధించలేని దానిని నీకిస్తాను
ప్రేమ, నిరీక్షణ, పరిశుద్దత నింపుతాను
నా రూపానికి నిన్ను మారుస్తాను