యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు (మార్కు 15:5).
రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి రక్షకుడై యేసు ఏ జవాబు ఇవ్వకపోవడం అనే ఈ దృశ్యంకంటే హృద్యమైన దృశ్యం బైబిల్లో మరోటి లేదు. తన దివ్యశక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చెయ్యగల సమర్ధుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చెయ్యనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు.
నిలకడగా ఉండడంలో శక్తి ఉంది. దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది అది. మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాలనుండి స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది. అది జ్ఞానాన్నీ, ముందు చూపునీ మనలో ఉంచుతుంది. మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనుపరుస్తుంది.
ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగజేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే సంరక్షించుకో జూస్తాము. దేవా ఈ మౌనబలాన్ని మాకనుగ్రహించు. జయించే ఆత్మని దయచెయ్యి. ఈ భూమీపై అగ్ని, సంఘర్షణ అంతమైన తరువాత, మంచు పర్వతాలను, సంధ్యరుణిమను, మన్దమారుతాన్నీ గోర్రేపిల్లలను , సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు.
యేసు ఒంటరిగా నిలిచిన రోజు
మనుషులు పాషాణ హృదయులైన రోజు
దురిత విమోచన జరిగిన రోజు
ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు
దొంగ సాక్ష్యాలు పలికిన రోజు
పెడరెక్కలు విరిచి కట్టిన రోజు
రారాజా శుభమని అపహసించిన రోజు
ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు
ఆయనపై ఉమిసిన రోజు
యెరూషలేమంతా ఈడ్చుకువెళ్ళిన రోజు
అవమానములే చేసిన రోజు
ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు
మిత్రమా చీటికీ మాటికీ ప్రతి చిన్నదానికీ
చిర్రుబుర్రులాడుతున్నావా?
కోపం తెచ్చుకుంటున్నావా ప్రతి రోజు?
నీ రాజు మౌనంగా ఉన్నాడు ఆ రోజు
మిన్నెసొటా బిషప్ అయిన విపిల్ గారిని "రెడ్ ఇండియన్ల అపొస్తలుడు" అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు. "నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు ముప్పయి సంవత్సరాలు పట్టింది" ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగతీర్చుకునే స్వభావమూ, ప్రతీదాన్ని పట్టించుకుని గిల్లికజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది. మనుషుల నాశనానికి గాక, రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము.