Day 85 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నెరవేర్చడానికి ఇష్టంలేని కోరిక దేన్నీ పరిశుద్ధాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి కెగిరి నీ కంటికి ఆనీనంత మేరా ఉన్న
భూమిని స్వాధీనం చేసుకోవాలి - ఎస్. ఎ. కీన్.

విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవేనా నీ స్వంతం అయినట్టే భావించు. ఎంతదూరం చూడగలిగితే అంతదూరం చూడు. అంతా నీదే. క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో, క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయ్యాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే. ఆ తరువాత ఇంకా దగ్గరికి రా. నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడివై, దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకమూ బాప్తిస్మం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరిచినప్పుడు, నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉంది. తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలూ ఆయన ప్రేరేపణవల్ల నీలోనిదురలేచే ఆకాంక్షలూ యేసుని వెంబడించే వాడికి దొరికే అవకాశాలూ అన్నీ నీ స్వంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది.

మన దేవునికి మన పై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది. ఉదాహరణకి చూడండి. చలికాలం ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం, సూర్యరశ్మి కోసం ఖండాలు, సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు. అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు. వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి, ప్రకాశవంతమైన ఎండను సిద్దం చేస్తాడు. క్రేన్లు అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు, చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్ పూర్ అనేచోటికి వలసవచ్చాయి. ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు. అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు.

పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు, ఆ ఆశవైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. వాటిని అనుగ్రహించ లేకుండా ఆయన చెయ్యి కురుచకాలేదు.

"వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని. . ." (లూకా 22:13).