Day 41 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి (రోమా 12:19)

కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చెయ్యడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగలవాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన, అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసినవాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువైతే మౌనంగా మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాపనిందలపాలైన వాళ్ళకి, ఏ తప్పు చెయ్యకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్ధమవుతుంది, దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో.

మనుషులు నిన్నపార్థం చేసుకోవచ్చు
నిందించే నెపం వెదకవచ్చు
అభియోగం మోపవచ్చు
తొణకక బెణకక మౌనం వహించు
క్రీస్తే న్యాయాధికారి!వాళ్ళుకాదు
భయం వదలి వీ మౌనబలం చూపించు

పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, "ఇవేవీ నన్ను కదిలించలేవు."

"ఇవేవీ నన్ను గాయపరచవు" అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి యే అపొస్తలుడు విలపించినట్లు కనబడడు. యేసు ప్రభువు కన్నీళ్ళు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకీ ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే "ఇవేవీ నన్ను గాయపరచవు" అనడం లేదు పౌలు. గాయమవుతుంది గాని తాను నమ్మినదానినుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢనిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం.