Day 54 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చెను (1 సమూ 17:34).

దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్నీ ప్రోత్సాహాన్నీఇస్తుంది. దేపునికై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్నీ, ఎలుగుబంటినీ చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. ఆ సింహం వచ్చినప్పుడు గనుక తొట్రుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడుచుకునేవాడే. ఇశ్రాయేలీయులకి దేవుడేర్పరచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు.

సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమనీ ఎవరూ అనుకోరు. ఇది హడలగొట్టే సంఘటనే. కాని సింహం అనేది మారువేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకెదురయ్యే ప్రతి ఆవేదనూ మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధనా మన పెరుగుదలకి ఒక మెట్టు.

సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు ఇచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేనివాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుచును గాక.