Day 92 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను (నిర్గమ 16:10).

మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాల అంచుల్లో తొంగిచూసే శ్వేతకాంతి కోసం చూసే అలవాటును నేర్చుకోండి. అది కనిపిస్తే దానినుండి దృష్టి మరల్చుకోవద్దు. మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలే చూడొద్దు.

ఎంత ఒత్తిడి, నిస్సహాయత ఆవరించినప్పటికీ, నిస్పృహకి తావియ్యకు. నిస్పృహ చెందిన హృదయం మరే పనీ చెయ్యలేదు. శత్రువు బాణాలను ఎదుర్కోవాలనే మెలకువే నశించిపోతుంది. ఇతరులను తన ప్రార్థనలద్వారా ఆదుకోవాలనే ప్రసక్తేలేదు.

సర్పం బారినుండి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహ అనే భయంకరమైన రోగం నుండి పారిపోండి. ఓటమినంగీకరించీ మట్టి కరవకుండా నిలిచి ఉండాలంటే దానికెప్పుడూ వెన్ను చూపించకూడదు.

దేవుని వాగ్దానాల కోసం వెదకండి. ప్రతిదాన్నీ నోరారా వల్లించండి. "ఈ వాగ్దానం నాకే." మీకింకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ హృదయాన్ని పదేపదే వేధిస్తున్న శంకల్ని గద్దించమని శరణు వేడండి.

మీరు మనసార ఇలాంటి అపనమ్మకం నిస్పృహలనుండి మొహం తిప్పేసుకున్న మరుక్షణం, పరిశుద్ధాత్మ మీ విశ్వాసానికి క్రొత్త ఊపిరిపోసి, మీ హృదయాల్లో దైవ శక్తిని నింపుతాడు.

మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు. కానీ సర్దుబాటుకి తావు లేకుండా అచంచలమైన నిశ్చయతతో మీమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మీరు అణగదొక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదానివెంట ఒకటి మీనుండి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసి వస్తుంది.

పిశాచాల సైన్యాలను తిరస్కరించి దేవుని వైపుకి తిరగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తిసామర్థ్యాల పరలోక దళాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత మంచిది! మనల్ని నిస్పృహలోకి, ఆందోళన, నిరుత్సాహాల్లోకి ఈడ్చే దుర్మార్గుడైన సైతానుని మనం అసలు పట్టించుకోనే పట్టించుకోము.


దైవత్వంలోని అత్యున్నతమైన బలప్రభావాలన్నీ, క్రీస్తు పేరట, సంపూర్ణ విశ్వాసంతో, దేవునికి తన్నుతాను సమర్పించుకుని ఆయన వైపుకి సహాయ సహకారాల కోసం తిరిగే అతి దీనుడైన విశ్వాసి పక్షమవుతాయి.

ఒకరోజు ఉదయం ఒక డేగ తుపాకి గుండు దెబ్బతిని కూలిపోయింది. దాని కళ్ళింకా కాంతిపుంజాల్లాగా మెరుస్తూనే ఉన్నాయి. అది మరణ బాధలో అతి కష్టంమీద కళ్ళెత్తి ఆశగా, ఆబగా ఆకాశంలోనికి చూసింది. ఆ ఆకాశమే దాని ఇల్లు. అది ఆ డేగ సామ్రాజ్యమే. తన రెక్కల్లోని తేజస్సుని, బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది. ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని ముద్దు పెట్టుకుంది. గాలితో పందాలు వేసింది. మరి ఇప్పుడో, తన దారికి దూరంగా నేలమీద మరణానికి దగ్గరగా పడి ఉంది. ఇది ఎలా జరిగిందంటే క్షణకాలం ఏమరుపాటువల్ల ఆ డేగ భూమికి దగ్గరగా ఎగిరింది. మన ఆత్మ ఈ డేగలాటిదే, ఈ లోకం కాదు దాని నివాసం. ఆకాశవీధుల్ని, ఆకాశంవంకదృష్టిని వదలకూడదు. విశ్వాసాన్ని, నిరీక్షణని, ధైర్యాన్ని, క్రీస్తుని ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండాలి. మన ధీరత్వంలో నిలబడలేని పక్షంలో యుద్ధరంగం నుండి వెనక్కి తగ్గడమే మంచిది. ఆత్మలో కంగారుపడి తప్పటడుగులు వెయ్యాల్సిన సమయం కాదిది. ఆత్మతో చెప్పండి ఆకాశం వైపుకే దృష్టిసారించు.

పాదాల చుట్టూ కెరటాలు నురగలు కడితే
ఆ దేవుడే చూసుకుంటాడు! అదే మన నినాదం
పైవాటినే లక్ష్యపెట్టండి, పైకి చూడండి

ఆత్మని అంధకారం ఆవరించినప్పుడు
దేవుని దివ్యకాంతి ఆత్మని వెలిగిస్తుంది
పైవాటినే లక్ష్య పెట్టండి పైకే చూడండి

అంతులేని పోరాటాలతో అలసినప్పుడు
ఆదరిస్తాడు నీ సైన్యాల అధిపతి
పైవాటినే లక్ష్యపెట్టండి, పైకే చూడండి.

పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం కనిపించదు.