చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి (మత్తయి 10: 27).
మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటిమాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండిచేసే దుఃఖపు చీకటికొట్టులోకి నడిపిస్తున్నాడు.
అక్కడ అత్యాశ్చర్యం, అత్యద్భుతం అయిన తన నిత్య, అనంత సత్యాలను చెప్తాడు. మిరుమిట్లుగొలిపే ఈ లోకపు కాంతివల్ల గుడ్డివైపోయిన మన కళ్ళకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు. బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు. ఇహలోకపు రణగొణధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి.
కాని ఈ విధంగా వినడంవల్ల బాధ్యత మనమీద దానంతటదే పడుతున్నది. "దానిని మీరు వెలుగులో చెప్పండి ఇంటి కప్పులమీద దానిని ప్రకటించండి."
మనం కలకాలం చీకట్లోనే, మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు. త్వరలోనే జీవితపు తొక్కిసలాటలోకి మనమూ వెళ్ళవలసి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది.
దీనివలన శ్రమలు అనుభవించడంలోను, తలాతోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోను ఒక క్రొత్త ప్రయోజనం, అర్థం మనకి స్ఫురిస్తాయి.
"నేనెంత పనికిమాలినవాణ్ణి!" "మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను?" "నా ఆత్మ అనే ఈ ప్రశస్థ పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా?" శ్రమలను అనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు. అయితే వీటన్నింటిలో దేవునికి ఒక పథకం ఉంది. ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తయిన కొండల్లోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొండ దిగివెళ్ళి ఎదురు చూస్తున్న జనసమూహానికి ఆ సందేశాలను అందించాలి.
కొండమీద మోషే గడిపిన నలభై రోజులు, హోరేబులో ఏలియా గడిపిన కాలము, అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలూ వ్యర్థమెలా అవుతాయి?
విశ్వాస జీవితంలో దగ్గర దారి అంటూ ఏమీ లేదు. దేవునితో ఒంటరి సంభాషణ, సహవాసం, ధ్యానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసమూ, స్థిరమైన బండ సందులో విశ్రాంతీకరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు. ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశతారలు కనిపించే వేళలో అనంతమూ, శాశ్వతమూ అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం.
దైవసన్నిధి మన ఆత్మల్లో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గ లేదు. అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనకారుడితో కలిసి పాడగలుగుతాయీ "దేవా నీవు సమీపంగా ఉన్నావు."