నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7).
హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే "ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ" మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం . ఇక ప్రభువుకు మొర్రపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది?
మార్త అంది కదా, "ప్రభూ, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయే వాడు కాదు." అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు. "నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు" ఇలా కష్టాల నడిబొడ్డుకి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము. కాని తనవాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. "నేను ఆపదలలో చిక్కుబడి యున్నను, నీవు నన్ను బ్రతికించెదవు."
ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికి మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిబొడ్డీ ఆయన మనల్ని బ్రతికించే చోటు. మనల్ని విడిచిపెట్టే చోటు కాదది.
ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే, ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది?
సుడిగాలి నిన్నెగరేసుకు పోగలదని
దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు
వడగండ్లవాన వేధిస్తుందని వేదన పడకు
తుపాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచివెళ్ళు
అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా
విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు.
సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి
దుష్టశక్తులు పార్లాపారాయి కట్టలు తెంచుకుని
కొండల్లా అలలెగసిపడ్డాయి
వాన పడగ అవనిని మూసింది
దేవుడి నానుకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది
తుపాను నడిబొడ్డున స్తుతి పాటలు పాడింది
పెనుచీకటిలో ఆశల్ని ఆర్పెయ్యవద్దు
పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరినా
చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి
తండ్రి ప్రేమ ఇస్తుంది నీకా ఆకాశదీపాల కాంతి
చీకటి పొరల్ని చీల్చుకుని పై పైకి దృష్టి సారించు
కాంతిమయుని వదనారవిందంలోకి
ప్రమాదంనుండీ పాపంనుండీ నీకు రక్షణగా
దేవుడే తుపానుని రప్పించాడు
ఆయన మాటతోనే ఊరుకుంటుంది
గాలిచేసే గోల హల్లెలూయ అవుతుంది
అందుకే తుపాను మబ్బులు పడితే ఉత్సహించు
తుపాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు