వివాహ బంధం 2


  • Author: Bharathi Devadanam
  • Category: Family
  • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

“దేవ సంస్తుతి చేయవే మనసా..” మనోహరంగా ఆ పాట సాయంకాలం ప్రకాష్ అంకుల్ గారి ఇంట్లో నుండి వినబడుతోంది. ఆ సాయంత్రం ఇల్లంతా సందడిగావుంది. ఇంటి నిండా బంధువులు, స్నేహితులు, సంఘస్తులు, కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో కోలాహలంగా ఉంది. పాట పూర్తి అయింది. పాస్టర్ గారు బైబిలు చేత పట్టుకొని నిలబడ్డారు. “దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రకాష్ మేరి గార్ల 40వ వివాహ మహోత్సవం సందర్భంగా మనమందరం ఇక్కడ చేరాము. కీర్తనలు 103 చదువుకుందాము” అని చెప్పి 103 కీర్తనలో దావీదు దేవుని ఏ యే విషయాల్లో స్తుతించాడో రమ్యంగా వివరించారు. కుడిక తరువాత మంచి విందు ఏర్పాటు చేయబడింది. అందరూ అంకుల్ ఆంటీ లను అభినందిస్తున్నారు. వచ్చిన అతిధుల్లో సిరి ఆనంద్ అనే యువ జంట కూడా ఉన్నారు. ఆనంద్ కు ఒక సందేహం వచ్చి “అంకుల్! నలభై సంవత్సరాలు మీరు ఎలా కలిసి ఆనందంగా జీవించారు? మీ ఆనందానికి రహస్యం ఏమిటి ?” అని అడిగాడు. ప్రకాష్ అంకుల్ నవ్వి “ఏముంది.. మేమిద్దరం చెవిటి వాళ్ళం.. సో ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్” అన్నారు. ఒక్కసారిగా అక్కడ నిశబ్ధం ఆవరించింది. కొడుకులు కూతుర్లు ముఖాలు చూసుకున్నారు. “ఏమిటి! అమ్మా నాన్నలకు చేవుడా!!” అన్ బిలీవబుల్!... చీమ చిటుక్కుమనక ముందే చూసే అమ్మా నాన్నలు!!!”. పాస్టర్ గారికి అర్ధమైంది చిన్నగా నవ్వారు. మరి ఈ కాలపు భార్యా భర్తలకు కూడా ఈ విషయం అర్ధమైతే వారి వివాహ బంధం కూడా ఎంతో గట్టిగా నిలిచి వుంటింది. కొన్ని కొన్ని సార్లు మన కిష్టంలేని సంగతులు జరిగినప్పుడు, ఇష్టంలేని మాటలు విన వలసి వచ్చినప్పుడు మనం చెవిటి వారి వలే వుంటే కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. పాతనిబంధనలో సౌలుహారాజు తనను కొందరు నిర్లక్ష్యం చేసి కానుకలు తీసికొని రానప్పుడు చెవిటివాడైనట్లు ఊరకుండెను అని I సమూ 10:27 లో వ్రాయబడింది. దావీదుకు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. అందుకే కీర్తనలు 38:13 లో “చెవిటి వాడైనట్టు నేను వినకయున్నాను” అన్నాడు.

అనేక సార్లు బయట వారి విషయాలలో సహనం పాటిస్తాము. సంబంధాలు చెడిపోతాయని. మరి స్వంత వారి విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపాలి కదా! మాటా మాటా పెరిగినప్పుడు, ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా తగ్గాలి, విననట్లు వుండాలి. జ్ఞానియైన ప్రసంగి అంటున్నాడు ప్రసంగి 3:1-7 లో “ప్రతిదానికి సమయము కలదు... మౌనముగా నుండుటకు, మాటలాడుటకు...”. దేవుని వాక్యమునకు విలువనిచ్చి, కాసేపు మౌనంవహిస్తే, దేవుడు తప్పక తన కృపా కార్యమును చేసి భార్యా భర్తలమధ్య సమాధానం అనుగ్రహిస్తాడు. దాని ద్వారా వారి వివాహబంధం ఇంకా బలపడుతుంది. భర్తలకు ఈ విషయంలో యింకా ఎక్కువ భాద్యతను దేవుడు ఇస్తున్నాడు. అందుకనే ఎక్కువ అనుభవం కలిగిన పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో “బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి... జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” అంటున్నాడు. నిజమే...! తమ స్వంత వారిని విడిచి స్త్రీలు ఎక్కువగా తమ భర్తపై ఆధారపడతారు. కొన్నిసార్లు భర్త ప్రేమను కోరుకుంటారు. కొన్ని సార్లు భర్త ప్రేమను డిమాండ్ చేస్తారు. ఆ ప్రేమను భర్త ఇవ్వగలిగినప్పుడు, ఎంతటి త్యాగములైనా చేస్తారు. స్వభావసిద్ధంగా స్త్రీలు సున్నిత మనస్కులుగా ఉంటారు. ప్రకృతిసిద్ధంగా కూడా బలహీనంగా వుంటారు. సమాజం, కుటుంబం కూడా స్త్రీ నుండి ఎక్కువ పనిని, సమర్పణను, సహనాన్ని, త్యాగాన్ని కోరుకుంటుంది. ఈ పరిస్తితుల్లో భర్తనుండి సహకారాన్ని, మోరల్ సపోర్టును, ప్రేమను తప్పక భార్య కోరుకుంటుంది. చాలాసార్లు లోకస్తులైన భర్తలు భార్యలను బాగా చూసుకుంటారు కాని విశ్వాసులు ఈ విషయంలో అలసత్వం చూపుతుంటారు.

పనుల ఒత్తిడిలో అలసిపోయిన మీ భార్య వదనంలో చిరునవ్వులు పుయించండి. అలసిపోయి చిరాకుపడి -నప్పుడు “నీవొక్కదానివే పనిచేస్తున్నావా? ఆడవాళ్ళంతా పనిచేయడం లేదా! ఎదురింటి ఆమెను చూడు, మా ఆఫీసులో ఫలానా ఆమెను చూడు, ఎంత ఆక్టివ్ గా వుంటుందో..” అని మాత్రం అనకండి, కొంచం చేయూత నివ్వండి. ప్రోత్సాహ-పరచండి కొంచం ఆమె పనిని మెచ్చుకోండి. ఇవన్నీ నాకు చేత కావు అంటారా... కాసేపు చెవిటి వాళ్ళు అవ్వండి. సొలోమోను మహారాజు మంచి సలహా ఇస్తున్నాడు సామెతలు 15:1 లో “మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును”.

కాబట్టి మనం చిన్న చిన్న విషయాలలో కొంచం ఓపిక పట్టి, మౌనం వహిస్తే దేవుడు గొప్ప గొప్ప ఉపద్రవాలనుండి కాపాడి భార్యా భర్తల వివాహబంధాన్ని కలకాలం ధృఢపరుస్తాడు. మీ భార్య సంతోషంగా వుంటే, మీరు కూడా సంతోషంగా వున్నట్టే కదా! చివర్లో ఒక చిన్న మాట. మీకు కొంచెం చెవుడా! అయితే అదీ మంచిదే.

toilax 5mg toilax 01 toilax spc