యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది (కీర్తన 25: 14).
దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసినవెన్నో రహస్యాలు ఉన్నాయి. వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టు గాను, భయంకరమైనవిగానూ కనిపించవచ్చు. మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది. "ఇది దేవుని రహస్యం, మీరైతే పైపైనే చూస్తారు, నేనైతే వీటివెనక దాగున్న పరమార్ధాన్ని చూస్తాను" అంటుంది.
ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు అవి విలువైనది ఇతరులు గమనించకుండా చేయడానికి. అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయటనుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు. దాని విలువ ఎంత లోపల ఉన్నది. పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం, మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంత మాత్రము చూపించడంలేదు.
ప్రియమిత్రులారా, దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు. వాటిమీద చుట్టిన కాగితం మురికిగా, గరుకుగా ఉంటే కంగారు పడకండి. అవి ప్రేమ, జ్ఞానం దేవుని కరుణల ఊటలని ఏ మాత్రం సందేహించకుండా నమ్మండి. ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్లయితే, అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేటతెల్లమవుతాయి.
మగ్గం తిరగడం మానే దాకా నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నెలర్ధం కావు. పరలోకంలోని పరమ సాలెవాని చేతిలో వెండి పసిడి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్ల దారాలంతే ముఖ్యం.
క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నింటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు. పరిస్థితితులు మిమ్మల్ని అటు ఇటు నొక్కి వేధిస్తున్నాయా? దూరంగా నెట్టెయ్యకండి. కుమ్మరివాడి చేతులవి. ఆ పరిస్థితుల నుంచి తపించుకోవడం వల్ల కాక, క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది. నిన్నాయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు, నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకి తేవడం కూడా చేస్తున్నాడు.