Day 131 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మేము నిప్పులలోను నీళ్లలోను పడితిని. అయినను నీవు సమృద్ధిగాచోటికి మమ్ము రప్పించియున్నావు (కీర్తన 66: 12).

వినే వాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు కానీ, కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం. ఇలా సాధించినన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తర్వాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది.

కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైనవాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకు గురికాలేదు. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికి తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతడు పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే.

మొట్టమొదటిసారిగా శ్రమలోచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్ని కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానకి నేలకూలిన తీగేలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతంనుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి "దేవుడున్నాడు" అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమౌతుంది.

జీవనంలో పెనుతుఫాను రేగింది. జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశా అడుగంటింది చివరికి ఆయన కన్నులు తెరిచాడు అంతా ప్రశాంతత పరుచుకుంది.

అనుభవాల పెనుతుఫాన్లు భయాల గాలివానలు కలవరపరిచాయి నడిపించే వెలుగు వెలవెలబోయింది చీకటి రాత్రి చరచరా చిందులేసింది చివరికి ఆయన కన్నులు తెరిచాడు కృపా సూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు.

అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో క్రుంగింది మానసం, నేలకొరిగింది ఆవరించింది అంతా శూన్యం, నిస్పృహ వెన్నుతట్టి ధైర్యపరిచే వారు లేరు. చివరికి ఆయన కన్నులు తెరిచాడు సద్దుమణిగింది, ఆయనే దేవుడు.