అతడు మాటలాడుట చాలింపక ముందే... అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు (అనెను) (ఆది 24: 15,27).
యధార్ధమైన ప్రతి ప్రార్ధనకి ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది. మనం మాటలాడుట చాలించకాకముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామం పేరిట (అంటే క్రీస్తుతో ఏకమై అయన చిత్త ప్రకారం) విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడుతాయని.
దేవుని మాట నిరర్ధకం కానేరదు. ప్రార్ధనకి సంబంధించిన ఈ కసిని నిబంధనను మనం అనుసరిస్తే, మన ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది. పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం అసాధ్యం అయితే కావచ్చు.
కాబట్టి ప్రతి ప్రార్ధనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడు జవాబు ఇచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని, సత్యాన్ని చూపించడం మానడు (దానియేలు 9: 20-27, 10: 12 కూడా చదవండి).
మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి.
మనం అడిగి దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకి ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం.
ఒక కన్యక పెళ్లయినప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తుని మన రక్షకుడిగా, పరిశుద్ధపరిచేవాడిగా, బాగుచేసేవాడిగా, విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశపెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి, ఆయన పట్ల ఏవిధంగా ఉండాలని ఎదురుచూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి.
ప్రార్ధనలో నేనడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తూ ఉండగానే దక్కింది నాకు.