Day 142 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయన..... నెరవేర్చును (కీర్తన 37: 5).

"నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును" అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు.

"యెహోవా అనే మార్గం మీద పయనించు. ఆయన్ని నమ్ము, ఆయన పనిచేస్తాడు."

మనం నమ్మినప్పుడు, దేవుడు వెంటనే తన పని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకు చూపిస్తుంది వాక్యం. మన చేతుల్లో ఉన్న భారమంతటిని ఆయన మీదికి పొరలించు. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శారీరక అవసరం కావచ్చు లేక మనకి ఇష్టులైన వాళ్లెవరన్నా మారుమనస్సు పొందాలన్న ఆతృత కావచ్చు.

ఆయన నెరవేరుస్తాడు, ఎప్పుడు? ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శ్రీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము. ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి.

మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనమిక ఏమి కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు.

ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి, మరొక దానిలో వేలుపెట్టవద్దు. ఎంత హాయిగా ఉంటుంది! ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు.

ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడంలేదు అని కొందరు అనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పనిచేస్తున్నాడు. మీ పని అంతా ఆయన మీదికి నెట్టేసావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో. మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు, సందేహం లేదు.

మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను (57: 2). మరొక అనువాదం ఇలా ఉంది. "నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు. "ఈరోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడంలేదా? నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈరోజు నేను చేయవలసినపని, నా తలకి మించిన ఈ పని, చేయగలనులే అనుకొని నా శక్తిసామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని - ఈ పనే నేను ఆయనకి అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇహ చీకూచింతా లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు. జ్ఞానులు, వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి.

దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ, ఇది చాలవా, ప్రతి నిత్యము ఆయన వైపు చేతుల చాపడానికి?