ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది (కీర్తనలు 62:5).
మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇందులోనే మన అడగడంలోని తేలికదనం బయటపడుతుంది. రైతు తాను వేసిన పంట కోతకి వచ్చేదాకా పాటుపడుతూనే ఉంటాడు. గురిచూసి కొట్టే ఆటగాడు తాను విసిరినది గురికి తగిలేదాకా చాలించుకోడు. ఓ డాక్టరైతే తాను వేసిన మందు ఎలా పనిచేస్తున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. మరి క్రైస్తవుడు తన ప్రార్ధనా ఫలితాలకోసం ఎందువల్ల పట్టుదలతో కనిపెట్టడం లేదు?
దేవుని చిత్తం ప్రకారం, విశ్వాససహితంగా, వాగ్దానానుసారంగా యేసు నామం పేరిట, పరిశుద్దాత్మ ఆవేశంలో ఈ ఇహలోకపరమైన ఆశీర్వాదాలకొరకు గాని ఆత్మీయాభివృద్ధి కోసం గాని చేసే ప్రతి ప్రార్థనా సంపూర్ణ అంగీకారాన్ని పొందింది, లేక పొందుతుంది.
దేవుడు ఎప్పుడూ తన ప్రజల విన్నపాలను, అభిప్రాయాలను మొత్తం మీద ఉన్నవి ఉన్నట్టుగానే స్వీకరిస్తాడు. తద్వారా ఆయనకి మహిమా వారికి నిత్యమూ ఆత్మీయ క్షేమమూ కలుగుతాయి. క్రీస్తు కరుణనాశించి ఆయన దగ్గరికి వచ్చిన ఒక్క అభ్యర్థనను కూడా ఆయన నిరాకరించినట్టు కనబడదు. అందుకనే ఆయన పేరిట మనం చేసే ఏ ప్రార్థనకూడా వృథాగా పోదని మనం నమ్ముతాము.
ఓ ప్రార్థనకి జవాబు మనలను చేరవస్తూ ఉంటుంది, మనం దాన్ని చూడలేక పోవచ్చు. విత్తనం చాలాకాలం నేలలో ఉంటుంది. సరైన కాలం వచ్చేసరికి దాని ఆకులు విచ్చుకుని కనిపిస్తాయి. అది ఇంకా మొలకెత్తనంత కాలం ఆ విత్తనం చచ్చినట్టే, లేనట్టుగానే ఉంటుంది మన కళ్ళకి.
ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు రావడం అన్నది విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు. అడ్డంకులు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునిపై మనకి గల నిశ్చయతను ప్రదర్శించడం ద్వారా ఆయన్ని ఘనపరచడానికి ఇది మనకి సహాయపడుతుంది.