నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు (కీర్తనలు 68:28).
మన జీవితంలో ప్రతీదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మ శక్తి వలన బలపడతాయి. ఇది ఉడిగిపోయే శక్తి కాదు. ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూడుతుంది.
నీ రోజులు ఎలాగో నీ బలమూ అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనసు, సరైన ఆదర్శాలను రూపొందించుకోగలిగి వాటిని సాధించగలిగే శక్తి ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి.
నేను సాగిపోవడానికి దేవుడే నాకు శక్తి. బ్రతుకు బాట చవీసారం లేనిదైనప్పటికీ ముందుకి అడుగువేసే శక్తినిచ్చేది దేవుడే. మలుపులేని ఇరుకుదారిలో, ఆహ్లాదకరమైన సంఘటనలేమీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో, ఆత్మ క్రుంగిపోయిన వేళల్లో, మార్పు ఏమీ కనబడని గానుగెద్దు బ్రతుకులో బలాన్నిచ్చి నడిపించేది ఆయనే.
పైకి ఎక్కిపోవడానికి దేవుడే నాకు శక్తి. కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కిపోయే శక్తి నాకు ఆయనే.
క్రిందికి దిగివెళ్ళడానికి దేవుడే నాకు శక్తి. మనస్సును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాలనుండి, కొండగాలినీ వెచ్చని సూర్యరశ్మినీ వదిలి కొండ దిగి వచ్చేసే వేళలో గాలి స్థంభించి గుండె బరువెక్కితే బలమిచ్చి నన్నాదరించేది ఆయనే.
ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృశించిపోతూ ఉన్న ఒక వ్యక్తి అనేవాడు "ఈ దిగి రావడమే నేను భరించలేకపోతున్నాను"
నిశ్చలంగా ఉండడానికి దేవుడే నాకు శక్తి. కదలక మెదలక నిశ్చలంగా ఉండడం ఎంత కష్టం? పనేమీ లేక నిస్తేజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరం చెప్పుకుంటాం గదా? "అబ్బ, చెయ్యడానికి ఏదన్నా పని ఉంటే ఎంత బావుణ్ణు!"
చిన్నపిల్లవాడికి జబ్బుచేస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? ఆమెకి అది అగ్ని పరీక్షే కదా. అయితే ఏం చెయ్యకుండా కూర్చుని ఎదురు చూడడానికి ఎంతో శక్తి అవసరం. దేవుడే మన శక్తి. దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది. దేవుడు చాలు.